వైరస్‌కు మతం లేదని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు కానీ.. ఆయన మంత్రులకు మాత్రం… వేరే అభిప్రాయం ఉన్నట్లుగా ఉంది. ముస్లింలు కావాలనే వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారంటూ… ఏపీ మంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఎక్సైజ్ శాఖను నిర్వహిస్తున్న నారాయణ స్వామి.. కరోనా పాజిటివ్ వచ్చినా ముస్లింలు వైద్యులకు సహకరించడంలేదని మండిపడ్డారు. వద్దని వారిస్తున్నా రోగుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నారని .. ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సీఎం ప్రస్తుతం తన సొంత జిల్లా చిత్తూరులోనే లాక్ డౌన్ పాటిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లలోనో… ఐసోలేషన్ సెంటర్లలోనే నిజంగా.. అలా ముస్లింలు ప్రవర్తిస్తున్నారేమో ఎవరికీ తెలియదు.
చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు కూడా లేవు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్నే.. మంత్రి ఇలా నిజమే అనుకుని.. ముస్లింల మొత్తానికి ఆపాదించినట్లుగా కనిపిస్తోంది. వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు ప్లేట్లు, స్పూన్లు నాకుతున్నరంటూ.. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే.. అసలు వాటికి.. కరోనా వైరస్‌కు సంబంధం లేదు. అవి ఫేక్ వీడియోలు అని.. స్వతంత్ర సంస్థలు కూడా నిర్ధారించాయి. అయినప్పటికీ.. మంత్రి అవే నిజం అన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది.
మనుషులు ఎవరూ కావాలన వైరస్‌ను అంటించుకోరని.. వైరస్‌కు కులం, మతం తెలియదని..అందరూ చెబుతున్నా.. డిప్యూటీ సీఎం అంతటి వ్యక్తి.. ముస్లిం సమాజం మొత్తంపై నిందలేయడం.. ఆశ్చర్యం కలిగిస్తోంది. క్వారంటైన్‌కు పంపిస్తారన్న భయంతో.. తబ్లిగీ జమాతేకు వెళ్లి వచ్చిన కొంత మంది.. మొదట్లో.. బయటకు రాలేదు కానీ.. తర్వాత దాదాపుగా అందరూ క్వారంటైన్ కు వెళ్లారు. ఏపీలో తబ్లిగీలపై పెద్దగా కంప్లైంట్లు లేవు. కానీ డిప్యూటీ సీఎం ఏ ఉద్దేశంతో వారిపై నిందలేశారో మరి..!