ఏపీలో మద్యం అమ్మాలంటే ఎవరి పర్మిషన్ కావాలి..?. మంత్రులకు సొంత నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు కాబట్టి… ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం జరగాలి. సలహాదారులో.. మరొకరో దీనిపై రీసెర్చ్ చేసి.. జగన్ కు సమర్పిస్తే.. ఆమోద ముద్ర వేయడమో.. తిరస్కరించడమో చేస్తారు. అంతిమంగా ముఖ్యమంత్రి పర్మిషన్ ఇస్తే.. ఏపీలో లాక్ డౌన్ ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు చేస్తారు. కానీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి మాత్రం.. చంద్రబాబు చెబితే.. మద్యం విక్రయించడానికి సిద్ధమని ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు కానీ.. ఇలా చంద్రబాబు చెప్పాలనే షరతును ఎందుకు పెడుతుందో అనేది క్లిష్టమైన కాన్సెప్టే.
లాక్ డౌన్ సమయంలో.. మద్యం విక్రయాలు లేకపోవడంతో మందుబాబులు.. ఇబ్బందులు పడుతున్నామని.. మానసికంగా దెబ్బతింటున్నారని కథనాలు వస్తున్నాయి. వీరి కోసమైనా.. పరిమితంగా మద్యం అమ్మాలని ఏపీ సర్కార్ కు సూచనలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి వెసులుబాటు కల్పించారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ పైనో.. మరో విధంగానో.. బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో.. మద్యం అమ్ముతున్నారు. ఏపీ సర్కార్ కూడా.. అలాగే చేయాలని.. ఒత్తిడి వస్తోంది. ఇదేదో మంచి ఆలోచనే అన్నట్లుగా ఉన్న ప్రభుత్వం… చంద్రబాబు ఎక్కడ విమర్శలు చేస్తారోననని ఆగిపోతున్నట్లుగా ఉంది. ఆయన కూడా చెబితే.. మద్యం అమ్ముతామంటూ.. బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. అసలు ఏపీ సర్కార్… ప్రతిపక్షాల్ని.. ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం ఎప్పుడో మానేసింది కదా.. ఈ ఒక్క విషయంలో చంద్రబాబు ఆమోదం ఎందుకన్న సందేహం ఇతరులకు సహజంగానే వస్తోంది.
కొద్ది రోజులుగా.. మంత్రులు చంద్రబాబుపై ఒకటే విమర్శ చేస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉండి విమర్శలు చేస్తున్నారనేది ఆ విమర్శ. దానికి టీడీపీ నేతలు… మీకు చేత కావడం లేదని.. ఏపీకి వచ్చి చంద్రబాబు పని చేయాలని కోరుకుంటున్నారా అని కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమలో ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి. .. చంద్రబాబు చెబితే తాము మద్యం అమ్ముతామంటూ.. చేసిన ప్రకటన పార్టీకి మరింత డ్యామేజీ కల్పించేలా ఉందని నేతలు మథనపడుతున్నారు.