నందమూరి బాలకృష్ణ హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజులవి. భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థపై నిర్మాత గోపాల్‌రెడ్డి బాలయ్యతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. బాలయ్య కోసం ఎలాంటి కథ తీసుకురావాలా.. అని ఎదురు చూస్తున్నప్పుడు ‘మన్వాసనై’ అనే తమిళ సినిమా వాళ్ల దృష్టికి వచ్చింది. అది అప్పట్లో పెద్ద హిట్టు. ఆ కథైతే బాలయ్యకు బాగుంటుందనుకున్నారు. దర్శకుడిగా కోడి రామకృష్ణ ఓకే అయ్యారు. అప్పట్లో బాలయ్య తో సినిమా చేయాలంటే.. ముందుగా ఎన్టీఆర్‌కి కథ చెప్పాల్సిందే. దాంతో కోడి రామకృష్ణ, గోపాల్‌రెడ్డి కలిసి… ఎన్టీఆర్‌కి కథ వినిపించారు. కానీ ఎందుకో ఎన్టీఆర్‌కి ఈ కథ నచ్చలేదు. ”తమిళ నేటివిటీ ఎక్కువగా ఉంది.. మనకు సరిపడదు బ్రదర్” అని వాళ్లిద్దరినీ పంపించేశారు. కానీ.. గోపాల్ రెడ్డికి మాత్రం ఈ కథపై గురి ఎక్కువైంది. చివరి ప్రయత్నంగా బాలయ్యని కలిసి కథ వినిపించారు. విచిత్రం ఏమిటంటే.. ఈ కథ బాలకృష్ణకు బాగా నచ్చేసింది.
”నాన్నగారు ఈ కథ బాగుందనిపిస్తోంది” అని బాలయ్య ఎన్టీఆర్ కి చెప్పడంతో… కొడుకు కోసం మరోసారి ఈ కథని విన్నారు ఎన్టీఆర్. ఈ కథలో బామ్మ పాత్ర కీలకం. తమిళంలో ఆ పాత్రని ఓ పేరు లేని నటి పోషించింది. ఆ పాత్ర నిడివి ఇంకాస్త పెంచి, భానుమతితో చేయిస్తే ఈ సినిమా ఆడుతుందని సలహా ఇచ్చారు ఎన్టీఆర్. భానుమతి ఒప్పుకోకపోతే ఈ సినిమా చేయకూడదని హెచ్చరించారు. దాంతో కోడిరామకృష్ణ భానుమతి దగ్గరకు పరిగెట్టారు. భానుమతి ముందు తటపటాయించినా.. ఎన్టీఆర్ ఫోన్ చేసి అభ్యర్థించడంతో ఆమె కూడా కాదనలేకపోయింది. ఆ కథే తెలుగులో విడుదలై సూపర్ హిట్టయిన ‘మంగమ్మ గారి మనవడు’. ఈ సినిమాతో బాలయ్య హీరోగా స్థిరపడిపోయాడు. భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ కీ బాలయ్యకీ మంచి లింకు కుదిరింది. ఈ కాంబినేషన్లో ఆ తరవాత బోలెడన్ని హిట్ సినిమాలొచ్చాయి.
అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేముందు ఎన్టీఆర్ బాలయ్యని పిలిచి.. మూడు షరతులు విధించార్ట. భానుమతి సెట్‌కి వచ్చే సమయానికి అరగంట ముందే.. నువ్వు సెట్ లో ఉండాలి, ఆమె కారు ఆగగానే.. కారు దగ్గరకు వెళ్లి డోరు నువ్వే తీయాలి, ఆమె కిందకు దిగగానే, కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి… ఈ మూడూ షూటింగ్ జరుగుతునన్ని రోజులూ నువ్వు చేయాలి… అని గట్టిగా చెప్పార్ట. ఈ మూడు విషయాల్ని బాలయ్య ఏ రోజూ విస్మరించలేదు. సెట్లో బాలయ్య ప్రవర్తన చూసి భానుమతి కూడా ముచ్చటపడిపోయార్ట. ”ఇలా చేయమని మీ నాన్న చెప్పాడా” అని అడుగుతూనే ”పెద్దల్ని గౌరవించే లక్షణం నీకుంది.. పైకొస్తావ్” అంటూ ఆశీర్వదించార్ట. అదీ… ‘మంగమ్మ గారి మనవడు’ బ్యాక్ స్టోరీ.