ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి మూడు మాస్క్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఒక్కరికి 3 చొప్పున 16 కోట్ల మాస్కులను వీలైనంత త్వరగా పంపిణీ చేయాలన్నారు. హైరిస్కు ఉన్న వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తి చేశామని అధికారులు.. జగన్ కు వివరించారు. 32,349 మందిని వైద్యాధికారులకు రిఫర్ చేశామని… వారిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని నిర్ధారించామని తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని ఆదేశించారు.
కరోనా కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల కరోనా పరీక్షలకు చర్యలు తీసుకుంటున్నామని.. వైరస్ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనాకు పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఓ వైపు వైద్యులకు కూడా మాస్కుల్లేవని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో.. ప్రజలందరికీ మాస్కులు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. అదే సమయంలో.. పరీక్షలు కూడా.. చాలా పరిమితంగా చేస్తున్నారని విమర్శలు వస్తున్న సమయంలో ఏకంగా 32వేల మందికి కరోనా పరీక్షలు చేయాలని సూచించారు. కరోనా ప్రభావం ఏపీపై పడినప్పటి నుండి ఇప్పటి వరకూ మూడు, నాలుగు వేల టెస్టులు కూడా చేయలేకపోయారు.
కొద్ది రోజుల కిందట.. విశాఖ మెడ్ టెక్ జోన్లో తయారైన ట్రూనాట్ కిట్ల ద్వారా కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో…. వాటి ద్వారా టెస్టులు ప్రారంభం కాలేదు. మాస్కులు తప్పని సరి చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్లోనూ దొరకని సమయంలో.. విమర్శలు రాకుండా.. ఇలా ఒక్కొక్కరికి మూడు మాస్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటికి పంపిణీ చేస్తారో.. ఎక్కడ్నుంచి తెస్తారో అనేది మాత్రం.. తర్వాత డిసైడ్ చేసే అవకాశం ఉంది.