స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను ఉభయసభల్లో ఆరు నెలల్లో ఆమోదింపచేసుకోవాలి. లేకపోతే చట్టంగా మారదు. ఇప్పుడు ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ తమ బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటామని ప్రకటించింది. మండలిలో.. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఓడిస్తామమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు. మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది. ఎంత ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినా… వైసీపీకి కావాల్సినంత మెజార్టీ రాలేదు. ఐదుగురు ఎమ్మెల్సీలు మాత్రమే వైసీపీ వైపు చూశారు. అందుకే.. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు శాసనమండలి సెలక్ట్ కమిటీ పరిధిలో ఉండిపోయాయి.
అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. మండలి సమావేశాల్ని కూడా నిర్వహించక తప్పదు. శాసనమండలి రద్దు తీర్మానం చేశారు కానీ.. ప్రస్తుతం అది కేంద్రం వద్ద ఉంది. ఆ తీర్మానంపై ఏం చేయాలన్నదానిపై ఎలాంటి నిర్ణయాన్ని కేంద్రం తీసుకోలేదు. బడ్జెట్ సమావేశాల్లో బిల్లుగా మార్చి ఆమోదించేస్తారని… వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కరోనా కారణంగా కేంద్రం.. చర్చ లేకుండానే బడ్జెట్ ను ఆమోదించుకోవాల్సి వచ్చింది. ఇక శాసనమండలి రద్దు పై చర్చించే తీరిక లేకపోయింది. దీంతో.. శాసనమండలి రద్దు ఇప్పుడల్లా సాధ్యం కాదని తేలిపోయింది. ఈ కారణంగా.. ఏపీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా… శాసనమండలిని సమావేశపర్చాలి. చట్టాలు చేయాలనుకున్న బిల్లుల్ని కూడా.. మండలికి పంపాలి.
ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గించడం.. రాజ్యాంగ విరుద్ధమని.. యమనల రామకృష్ణుడు స్పష్టం చేస్తున్నారు. అలాంటి తప్పిదాలను చట్టసభలు చేయకూడదన్న అభిప్రాయంతో ఉన్నారు. అందుకే.. ఆ బిల్లును శాసనమండలిలో అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. శాసనమండలిలో చట్టం కాకుండా అడ్డుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కట్లలో పడుతుంది. ఓ ఆర్డినెన్స్ తీసుకు వచ్చి.. ఆ ప్రకారం చర్యలు తీసుకుని చివరకు ఆర్డినెన్స్‌ను ఆమోదించుకోలేకపోతే.. అధికారంలో కొనసాగే నైతిక అర్హత కోల్పోతుంది. తీవ్రమైన విమర్శలు వస్తాయి. ఈ పరిస్థితిని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి..!