ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ.. హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా.. శుక్రవారమే పిటిషన్ దాఖలు చేశారు. అంతకు ముందు యోగేష్ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజాగా.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా.. ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. అందరూ దాదాపుగా రాజ్యాంగంలోని 243కే ఆర్టికల్‌నే ప్రధానంగా తమ తమ వ్యాజ్యాల్లో ప్రస్తావించారు. ఈ ఆర్టికల్ ప్రకారం.. ఒక్క సారి నియమితులయిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించడం.. పదవీ కాలాన్ని తగ్గించడం సాధ్యం కాదు. అలా చేయాలంటే.. దానికి ఓ ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. వీటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందనేది ఆయా పిటిషనర్ల ఆరోపణ.
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ల పదవి కాలాన్ని తగ్గించడం.. రాత్రికి రాత్రి వేరేవారితో ప్రమాణ స్వీకారం చేయిచడం లాంటివి ఇంత వరకూ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదు. తొలి సారి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. దీంతో.. హైకోర్టు ఈ పిటిషన్లపై ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియను.. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం.. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా.. స్వతంత్రంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో విశేష అధికారాలు కల్పించారు. ఈ కారణంగా.. ఎన్నికల సంఘం.. స్వతంత్రంగా వ్యవహరించగలిగేది. కానీ ఏపీలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి … ఆయనపై ఆరోపణలు చేశారు. ఇలాంటి సమయంలో.. ఆయనను తొలగించడం.. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడమేనన్న వాదన న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారణకు.. హైకోర్టు అనుమతించింది. సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే కొత్త ఎస్ఈసీని గవర్నర్ నియమించారు. ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇలాంటి సమయంలో.. హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఈ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని భావిస్తే.. గవర్నర్ కూడా.. ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటారన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.