వంశీ సినిమా అంటే ఇళయరాజా పాటలు కంపల్సరీ. హీరో, హీరోయిన్… ఎవరున్నా లేకున్నా ‘నాకు ఇళయరాజా కావాల్సిందే’ అని పట్టుబట్టి మరీ ఆయనతో పాటలు చేయించుకుంటాడు వంశీ. దానికి తగ్గట్టుగానే వీరిద్దరి కాంబో అంత సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ తరవాత చక్రి నుంచి కూడా అంతే మంచి పాటలు రాబట్టుకున్నాడు వంశీ. వీరిద్దరి అనుబంధం కూడా ప్రత్యేకమైనది. అయితే… వంశీ – చక్రి కలయిక మాత్రం చాలా విచిత్రంగా ప్రారంభమైంది.
‘వైఫ్ ఆఫ్ వర ప్రసాద్’ సినిమా ఫ్లాప్ అయ్యాక కొంతకాలం వంశీ కనిపించలేదు. ఆయన దగ్గర నిర్మాతలు రావడానికి భయపడ్డారు. చివరికి ఎన్నో ప్రయత్నాల తరవాత ఓ సినిమా ఓకే అయ్యింది. అదే.. ‘ఔను… వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఇళయరాజాని పెట్టుకుందామనుకున్నాడు వంశీ. కానీ నిర్మాత మాత్రం ‘మా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఎవరినైనా కొత్తవాళ్లని పెట్టుకోండి’ అనేసరికి… కొత్త సంగీత దర్శకుడి కోసం వంశీ అన్వేషణ ప్రారంభమైంది. ఓసారి కారులో వెళ్తుంటే ‘మళ్లి కూయవే గువ్వా’ అనే పాట వినిపించింది. ‘ఈ పాట ఎవరు చేశారు’ అని వంశీ ఆరా తీస్తే ‘చక్రి’ పేరు వినిపించింది. దాంతో ‘ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టరు దొరికేశాడు’ అని వంశీ ఫిక్సయ్యారు.
వంశీ సినిమాలో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రతీ రోజూ సాయింత్రం ఆరింటికే మొదలైపోతాయి. ఆ రోజు కూడా వంశీ ఆరింటికి ఆపీసులో కూర్చున్నారు. కానీ చక్రి రాలేదు. ఏడు, ఎన్నిమిది, పన్నెండు ఇలా సమయం దాటుతున్నా చక్రి రాలేదు. సాయింత్రం నాలుగు గంటలకు తాపీగా వచ్చి.. ‘కథేంటి సార్’ అని వంశీని అడిగాడట చక్రి. దాంతో వంశీ అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడట. ‘నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను. నువ్వూ వద్దూ.. నీ సంగీతం వద్దు.’ అంటూ అక్కడి నుంచి సర సర వెళ్లిపోతుంటే.. వంశీని ఎలా కూల్ చేయాలో అర్థం కాక.. ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ పాటని వేరే వేరే పదాలతో ట్యూన్ చేసి అప్పటికప్పుడు వినిపించాడట. ‘మీ సినిమా కథేంటో నాకు తెలీదు. ఈ పాట ఏ సందర్భానికైనా పనికొస్తుందేమో చూడండి’ అన్నాడట. ట్యూను నచ్చేసరికి వంశీ కాళ్లు ఆగిపోయాయి. ‘మళ్లీ పాడు ఈ పాట’ అని వంశీ అడగడం.. చక్రి పాడడం.. ఇలా కనీసం 20 సార్లు ఆ పాటే పాడించుకున్నాడట వంశీ. ఆ పాట నచ్చేయడంతో చక్రి చేసిన తప్పుని సైతం వంశీ క్షమించేశాడు. అలా `ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు` సినిమా మ్యూజిక్ సిట్టింగ్ పూర్తయ్యాయి. ఈ సినిమానే కాదు, పాటలూ సూపర్ హిట్టు. వంశీ కమ్ బ్యాక్ కి ఈ సినిమా బాగా ఉపయోగపడింది. అప్పటి నుంచీ వంశీ – చక్రిల ప్రయాణం మొదలైంది. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడిలా కాదు.. దాదాపుగా గురు శిష్యులుగానే మెలిగేవారు. చక్రీని ‘ఒరేయ్..’ అని పిలిచేంత చనువు తీసుకున్నారు వంశీ. ఇద్దరూ సినిమాల్లేనప్పుడు సరదాగా దూర ప్రయాణాలు చేసేవారు. వంశీకి వంటలు చేయడం బాగా ఇష్టం. ఆయన వండుతుంటే.. చక్రి తింటూ ఉండేవాట. చిన్న గొడవతో మొదలైన వాళ్ల స్నేహం… అలా బలపడింది.