మూడు వారాల క్రితం.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన లాక్డౌన్ గడువు మంగళవారంతో ముగుస్తుంది. కొనసాగించాలనే రాష్ట్రాల డిమాండ్ల మధ్య .. ఏం చేయాలన్నదానిపై ప్రధానమంత్రి చర్చోపచర్చలు జరిపారు. చివరికి ఓ ఫార్ములాని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం.. పది గంటలకు.. జాతినుద్దేశించి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దేశాన్ని మూడు జోన్లుగా విభజించి లాక్డౌన్ సడలించే ప్రక్రియపై ఓ ఫార్ములాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
తయారీ రంగం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాలకు.. మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. రెండు రోజులుగా ప్రధాని నివాసంలో హైలెవల్ కమిటీ సమావేశాలు జరిగాయి. కేంద్ర హోం, రక్షణ, ఆరోగ్య శాఖ మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. వాణిజ్య శాఖ కూడా.. లాక్డౌన్ సడలింపుపై కేంద్ర హోంశాఖకు కీలక సూచనలు చేసింది. ఇప్పటికే లాక్డౌన్ కొనసాగిస్తామని వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు.
అయితే.. ఆయా రాష్ట్రాల లాక్ డౌన్లు కూడా… కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండే అవకాశం ఉంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ గా గుర్తించి రాకపోకల్ని పూర్తిగా నిషేధించడం… గ్రీన్ జోన్లలో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో పాటు.. పారిశ్రామిక రంగం … కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ఆర్థిక విపత్తు నుంచి తప్పించుకోవచ్చన్న అభిప్రాయం కేంద్రంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం… ప్రధానమంత్రి మోడీ ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.