రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ టీజర్‌ని విడుదల చేసి.. మెగా ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు రాజమౌళి. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు రాబోతోంది. మే 20.. ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాజమౌళి టీమ్ నుంచి మరో టీజర్‌ని ఆశించడంలో తప్పులేదు. చరణ్ పుట్టిన రోజుకి టీజర్ వదిలి, ఎన్టీఆర్ పుట్టిన రోజున.. ఎలాంటి హడావుడీ చేయకపోతే.. ఫ్యాన్స్ హర్టవుతారు. కచ్చితంగా ఎన్టీఆర్ పుట్టిన రోజున మరో టీజర్ వస్తుంది.
రామ్ చరణ్ ని ఎన్టీఆర్ గొంతుతో పరిచయం చేశారు.. తొలి టీజర్లో. ఇప్పుడూ అదే ఫార్ములా. చరణ్ గొంతులో ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేయబోతున్నారు. కాకపోతే.. ప్రస్తుతానికి ఆర్.ఆర్.ఆర్కి సంబంధించిన పనులేం జరగడం లేదు. కనీసం ఎడిటింగ్, రికార్డింగ్ పనులు కూడా పెట్టుకోలేదని చిత్రబృందం తేల్చేసింది. టీజర్ ఎలా ఉండాలి? అనే ఐడియా ఇప్పటికే రాజమౌళికి వచ్చేసినా, ప్రస్తుతానికైతే కట్ చేసి, ఆర్.ఆర్ యాడ్ చేసే వీలు చిక్కలేదు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేసినా… వెంటనే ఎన్టీఆర్ టీజర్ కి సంబంధించిన పనులు మొదలైపోతాయి. ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందనుకుంటే… ఎన్టీఆర్ టీజర్ కట్ చేయడానికి, తుది మెరుగులు దిద్దడానికీ చిత్రబృందం దగ్గర చాలా సమయం ఉంటుంది. మేలోనూ లాక్ డౌన్ కొనసాగితేనే కాస్త కష్టం. అదీ కాని పక్షంలో ఏం చేయాలన్న విషయంపైనా రాజమౌళి.. ఓ నిర్ణయానికి వచ్చేసిందని సమాచారం. ఇంట్లోనే ఉండి, టీజర్‌కి సంబంధించిన ఆర్.ఆర్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ పనులు చేసేస్తార్ట. అందుకు సంబంధించిన సాంకేతిక సమకూర్చుకోవాల్సివుంటుంది. మొత్తానికి ఎన్టీఆర్ టీజర్ మాత్రం రావడం ఖాయం.