ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజుకు ఇరవై నుంచి 30 నమోదు అవుతున్నాయి. అయితే.. అవి ఒకటి, రెండు జిల్లాలకే పరిమితం అవుతున్నాయి. మిగిలిన చోట్ల.. పెద్దగా నమోదు కావడం లేదు. అదే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో మాత్రం.. కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రోజుకు యాభై, అరవై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. లాక్ డౌన్ అమలును పొడిగించాయి. అదే సమయంలో.. ఏపీలో మాత్రం.. ఒకటి, రెండు జిల్లాలకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలనుకుంటున్నారు.
ఎన్ని టెస్టులు చేస్తున్నారో ఎందుకు ప్రకటించడం లేదు..?
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులెన్ననేదానిపై విపక్ష పార్టీలు కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నాయి. ఎప్పటికిప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియచేయాలని కాక.. కొన్నింటిని తర్వాత ప్రకటిద్దామనే ఉద్దేశంలో ఉన్నట్లుగా వారి వాదన. ఇటీవలి కాలంలో కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు బయటపడ్డాయి. వారం రోజుల క్రితం.. ఓ హెల్త్ బులెటిన్‌లో కృష్ణా జిల్లాలో 32 పాజిటివ్ కేసులున్నాయని రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత అది 29కి తగ్గిపోయింది. ఇలా ఎందుకు జరిగిందన్నదానిపై విపక్ష పార్టీల నేతలు ప్రశ్నల వర్షం కురిపించినా ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన లేదు. ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లోనూ.. ముఖ్యమంత్రి చెప్పిన వివరాల్లోనూ..తేడాలున్నాయన్న విమర్శలను ప్రతిపక్షపార్టీల నేతలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఎన్ని టెస్టులు చేస్తున్నారు.. ఏ ఏ జిల్లాల్లో చేస్తున్నారన్న దానిపై వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం లేదు. దీంతో విమర్శలు పెరిగిపోతూనే ఉన్నాయి.
మరణాలను గుర్తించడానికి కూడా సిద్ధపడని సర్కార్..!?
ప్రభుత్వం కరోనా విషయంలో పారదర్శకంగా లేదని చెప్పడానికి మరణాలు కూడా ఓ కారణం. ఏపీలో మొదటి కరోనా మరణాన్ని.. ఆ వ్యక్తి చనిపోయి.. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మాత్రమే ధృవీకరించారు. మొదటగా ఈ విషయాన్ని గుర్తింతచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడలేదు. కేంద్రం ప్రకటించిన తర్వాత తప్పనిసరిగా ప్రకటించాల్సి వచ్చింది. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. కరోనా పేషంట్‌కు మామూలుగానే అంత్యక్రియలు చేసేశారు. పెద్ద ఎత్తున జనం కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత కరోనా లక్షణాలతో కొన్ని మరణాలు చోటు చేసుకున్నప్పటికీ.. వారికి వివిధ రకాల సమస్యలున్నాయని టెస్టులు కూడా చేయకుండా.. బంధువులకు అప్పగించేశారన్న ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.
లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్ అని జాతీయ స్థాయిలో ప్రచారం..!
ఏ విధంగా చూసినా.. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో… మరణాల విషయంలో ఏదో దాస్తోందన్న అనుమానం మాత్రం ప్రజల్లో ప్రారంభమయింది. కరోనా తీవ్రత ఎక్కువగా లేదని చెప్పే ప్రయత్నంలో.. ఏపీ ప్రభుత్వం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఓ వైపు ఏపీలో కేసులు లాక్ డౌన్ అమలు ప్రారంభించిన తర్వాత వెయ్యి శాతానికిపైగా పెరిగాయి. మరో వైపు .. కొన్ని జాతీయ మీడియాలో.. వైసీపీ నేతలు లాక్ డౌన్‌ను అపహాస్యం చేస్తున్న వైనం.. హైలెట్ అవుతోంది. కోవిడియట్స్ అని విమర్శిస్తూ కథనాలు వస్తున్నాయి. మరో వైపు.. వైసీపీ పెద్దలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని భావిస్తున్న ఎన్డీటీవీలో మాత్రం.. లాక్ డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్ అనే కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ.. ఏపీలో కరోనా తీవ్రత లేదని చెప్పుకునేందుకు జాతీయ స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలుగా భావిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే లక్ష్యమన్న వాదన విపక్ష పార్టీల నుంచి వస్తోంది.