వైసీపీ అధినేత, సీఎం జగన్ .. ప్రధానమంత్రికి సోమవారం సాయంత్రం ఓ లేఖ రాశారు. అందులో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో లాక్డౌన్ అమలు ప్రతిపాదన తెచ్చారు. నిజానికి మోడీ ముఖ్యమంత్రులతో జరిపిన సమావశంలో కూడా జోన్ల గురించి చెప్పారు. ప్రత్యేకంగా లేఖ రాయాల్సిన అవసరం లేదు. అయితే.. నిజంగానే దేశ ప్రధానమంత్రి మూడు జోన్ల గురించి ఆలోచిస్తున్నారని.. జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. మూడు జోన్లుగా విభజించి.. సగానికిపైగా కరోనా కేసులు లేకుండా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు ఎత్తివేస్తారన్న అభిప్రాయం ఏర్పడింది. పారిశ్రామిక, వ్యాపార వర్గాలన్నీ లాక్ డౌన్ కొనసాగింపుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. దీంతో మినహాయింపులు ఖాయమని భావించిన వైసీపీ ఆ మేరకు.. లేఖ రాసి.. కొంత మేర క్రెడిట్‌ను.. తన ఖాతాలో వేసుకోవాలనుకుంది.
సోమవారం సాయంత్రం వరకూ.. లాక్ డౌన్ పరిమిత స్థాయిలో అమలు చేస్తారన్న అభిప్రాయం ఢిల్లీలో వినిపించింది. అందుకే.. లేఖను హుటాహుటిన మీడియాకు కూడా విడుదల చేశారు. తమ అధినేత దూరదృష్టి… మోడీనే ఆకర్షించిందని వైసీపీ నేతలు చెప్పుకునే ప్రయత్నం ప్రారంభించారు. అయితే.. అనూహ్యంగా … జాతినుద్దేశించి మోడీ చేసిన ప్రసంగంలో అలాంటి జోన్ల ప్రస్తావనే రాలేదు. పైగా మూడు వారాల పాటు.. కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాల్సిందేనని తేల్చేశారు. అయితే.. వ్యవసాయరంగానికి.. రోజువారీ కూలీలకు మాత్రం కాస్త వెసులుబాటు రేపు ప్రకటించనున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి.
నిజానికి కాస్త సడలింపు వచ్చినా.. పెండింగ్‌లో పడిపోయిన తమ రాజకీయ ఎజెండాను దుమ్ము దులిపి.. అమల్లో పెట్టడానికి వైసీపీ నేతలు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఎస్ఈసీని కూడా మార్చేశారు. సన్నాహాలు కూడా ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు పంపిణీ చేసి.. క్యూలైన్లలో భౌతిక దూరం పాటిస్తూ.. ఎన్నికలు నిర్వహించేయాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజధాని తరలింపు ముహుర్తం కూడా పెట్టుకున్నారు. కానీ ఏదీ కలసి కలసి రాలేదు. దీంతో డామిట్ కథ అడ్డం తిరిగింది అని అనుకోవడం తప్ప.. వైసీపీ నేతలు.. ఏం చేయడానికి లేకుండా పోయింది. అయితే.. జగన్ తత్వం తెలిసిన వాళ్లు మాత్రం.. లాక్ డౌన్ కొనసాగుతున్నంత మాత్రాన.. అన్నీ ఆపేస్తారని ఎవరు చెప్పారని.. జరిగేదేదో మీరే చూస్తారని వ్యాఖ్యానిస్తున్నారు.