గత పదిహేనేళ్లలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో ‘బొమ్మరిల్లు’ ఒకటి. చిన్న చిత్రాల మనుగడకు ఆ సినిమా ఊపిరిలూదింది. జెనీలియా లాంటి స్టార్నీ, భాస్కర్ లాంటి దర్శకుడ్ని తెలుగు చిత్రసీమకు అందించింది. అయితే… బొమ్మరిల్లు సినిమా అంత ఈజీగా ఏమీ వర్కవుట్ అవ్వలేదు. ఈ హిట్టు వెనుక బొమ్మరిల్లు భాస్కర్, అతని టీమ్ చాలా కష్టపడింది.
భాస్కర్ టాలెంట్ ఇది వరకే తెలిసిన దిల్ రాజు ఓరోజు భాస్కర్ని పిలిచి… ‘మంచి ఫ్యామిలీ స్టోరీ ఉంటే చెప్పు’ అని ఆర్డరేశాడు. అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న భాస్కర్.. దిల్ రాజు కోసం మంచి కథ అన్వేషణలో పడ్డాడు. అప్పటికే భాస్కర్ దగ్గర రెండు కథలున్నాయి. ఒకటి బొమ్మరిల్లు, రెండోది పరుగు. కానీ.. భాస్కర్ మాత్రం బొమ్మరిల్లు కథ చెప్పాడు. అది దిల్ రాజుకి విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాని ముందు నవదీప్‌తో చేద్దామనుకున్నారు. కానీ ఆ తరవాత సిద్దార్థ్ ఓకే అయ్యాడు. కథంతా రెడీ, టీమ్ అంతా కుదిరింది. మరో రెండు వారాల్లో షూటింగ్ అనగా… భాస్కర్‌కి ఓ పెద్ద డౌటు వచ్చింది. ‘ఈ కథంతా బాగానే ఉంది గానీ.. ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తోంది’ అనుకున్నాడు. ఇదే విషయం దిల్ రాజుకి చెప్పాడు. ‘నాకైతే కథ నచ్చింది. ప్రొడీస్ అయిపో’ అన్నాడు దిల్ రాజు. కానీ.. భాస్కర్ వినలేదు.
‘నాక్కొంచెం టైమ్ కావాలి. పదిహేను రోజుల పాటు వదిలేయండి… అప్పుడు మళ్లీ కథ చెబుతా’ అన్నాడు. ఏ నిర్మాత అయినా సరే.. షూటింగ్ కాన్సిల్ చేయమంటే అగ్గిమీద గుగ్గిలం అయిపోవాలి. కానీ దిల్ రాజు మాత్రం ‘సరే.. కావల్సినంత టైమ్ తీసుకో’ అన్నాడు. పద్నాలుగు రోజుల పాటు భాస్కర్, వేణు శ్రీరామ్ ఇద్దరూ కలిసి కథపై మళ్లీ కూర్చున్నారు. అప్పటికి హీరోయిన్ హాసిని పాత్రంటూ ఉంది కానీ, దానికంటూ కొత్తగా క్యారెక్టరైజేషన్ ఏమీ లేదు. కథానాయిక పాత్రని లవబుల్‌గా చేస్తే తప్ప, ఈ సినిమా వర్కవుట్ కాదని నిర్ణయానికి వచ్చారిద్దరూ. చేతిలో పదిహేను రోజుల టైమ్ ఉంది కాబట్టి, ఎలాగోలా – సెట్ అయిపోతుందనుకున్నారు. కానీ పదిహేను రోజులూ గడిచిపోయాయి కానీ.. హీరోయిన్ పాత్ర ఫైనలైజ్ అవ్వలేదు.
రేపు ఉదయం దిల్ రాజుతో ఫైనల్ సిట్టింగ్ ఉంది. ఈసారీ కథతో రెడీగా లేకపోతే పరువు పోతుంది. అందుకే భాస్కర్ లో టెన్షన్ ఎక్కువైంది. తెల్లవారుఝామున 4 గంటలకు భాస్కర్‌కి ఓ అమ్మాయి జ్ఞాపకం వచ్చింది. తలని ఒక్కసారి ఢీ కొంటే, ఆ అమ్మాయి ఒప్పుకోదు. రెండోసారి ఢీ కొట్టకపోతే కొమ్ములు వస్తాయని చెప్పి బలవంతంగా రెండోసారి తలని ఢీ కొట్టేది. ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ పట్టుకుంటే హీరోయిన్ కి ఓ యూనిక్ నెస్ వస్తుందని అనిపించింది. నాలుగు గంటలకు పెన్ను పట్టుకుంటే ఆరింటికల్లా హీరోయిన్ పాత్ర సిద్ధమైపోయింది. దాంతో పాటు.. కథకి ఓ కొత్తదనం వచ్చేసింది. ఆ వెంటనే దిల్ రాజుకి కొత్త వెర్షన్ చెప్పాడు భాస్కర్. అలా హాసిని పాత్రకు ఓ ఔచిత్యం, ప్రత్యేకత వచ్చాయి. ఆ పాత్రే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. హాసినికి ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా వచ్చింది.
ఈ సినిమా కోసం దాదాపు 80 వెర్షన్లు రాశాడట భాస్కర్. అందుకే సినిమాలోని ప్రతీ పాత్ర, ప్రతి డైలాగూ తన మైండ్‌లో ముద్రించుకుపోయింది. బొమ్మరిల్లు సినిమా అంతా ఒక ఎత్తు. క్లైమాక్స్ మరో ఎత్తు. ఆ క్లైమాక్స్ కోసం 27 వెర్షన్లు రాశారు. 60 రోజుల్లో తీయాల్సిన ఈ సినిమా కోసం 108 రోజులు కష్టపడ్డారు. ఒక్కో రోజు కేవలం ఒక్క షాట్ తోనే సరిపెట్టాల్సివచ్చేదట. క్లైమాక్స్ మాత్రం ఒక్క రోజులో పూర్తి చేశారు. ఇంతమంది, ఇన్నివిధాలుగా శ్రమించారు కాబట్టే… బొమ్మరిల్లు అనే మంచి సినిమా తెలుగులో చూడగలిగాం.