టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ ఉదయం ఎనిమిదిన్నరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేశారు. నిన్న పీఎంవోకు చంద్రబాబు.. ఫోన్ చేశారు. అప్పుడు మోడీ అందుబాటులో లేరు. దాంతో ఈ ఉదయం ఫోన్ చేసినట్లుగా చంద్రబాబు చెప్పారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చానని చంద్రబాబు చెప్పారు. కరోనా టెస్టులు ఎక్కువగా చేయాల్సి ఉందని.. అలా చేస్తేనే కరోనాను ఎదుర్కోగలమని చెప్పినట్లుగా చంద్రబాబు వివరించారు. మోడీ సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. నరేంద్రమోడీకి.. సూచనలు, సలహాలతో ఓ ప్రత్యేకమైన లేక కూడా రాశానని చంద్రబాబు వివరించారు.
కొద్ది రోజుల క్రితం.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. దేశంలో పెరిగిపోతున్న వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు.. పేదలకు చేయాల్సిన సాయంతో పాటు.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవసరమైన సూచనలు, సలహాల కోసం.. దేశంలోని అందరు ప్రతిపక్ష నేతలకు ఫోన్లు చేశారు. ముఖ్యమైన.. ప్రాంతీయ పార్టీల నేతలందరికీ ఫోన్లు చేశారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం చేయలేదు. అయినప్పటికీ.. చంద్రబాబు.. తన వంతుగా.. తానే కల్పించుకుని సూచనలు, సలహాలతో ఓ లేఖ రాశారు. స్వయంగా ప్రధానమంత్రితో మాట్లాడేందుకు పీఎంవోకు ఫోన్ చేశారు. ఈ ఉదయం ప్రధానమంత్రి ఫోన్ చేయడంతో తాను చెప్పాలనుకున్నది చెప్పారు.
లాక్ డౌన్ పొడిగింపును.. చంద్రబాబు సమర్థించారు. అయితే.. పేదలకు నిత్యావసరాలు అందేలా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకు పెనుసవాల్‌గా మారాయని, ఇదే సమయంలో ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమని అన్నారు.భారత దేశంలో లాక్డౌన్ తర్వాత 70 శాతం కరోనా కేసులు పెరిగాయన్న చంద్రబాబు ఏపీలోనూ.. వాటిని పెంచాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాబ్‌ల సంఖ్య చాలా తక్కువ ఉందని ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు.