పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ గురించి అభిమానులంతా ఆశగా ఎదురు చూశారు. మేలో `వకీల్ సాబ్` విడుదల కావాల్సింది. ఒకవేళ ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేస్తే.. వకీల్ సాబ్ రిలీజ్ మీద ఎన్నో కొన్ని ఆశలుండేవి. ఇప్పుడు మే 3 వరకూ కొనసాగడంతో – వకీల్ సాబ్ పై ఆశలు ఆవిరైపోయాయి. మేలో లాక్ డౌన్ ఎత్తేసినా, జూన్ వరకూ షూటింగులు మొదలుకాకపోవొచ్చు. దాంతో.. సినిమాలన్నీ నిరవధికంగా వాయిదా పడబోతున్నాయి.
ముఖ్యంగా వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాలు ఇప్పుడు రీ షెడ్యూల్లో పడ్డాయి. ఇక వకీల్ సాబ్‌ని దసరాకి షిఫ్ట్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. షూటింగ్ లు ఎప్పుడు మొదలైనా సరే… ఎలాంటి హడావుడి లేకుండా, మెల్లగానే సినిమాని పూర్తి చేయాలని, మంచి రిలీజ్ డేట్లోనే ఈ సినిమాని వదలాలని ఆయన భావిస్తున్నారు. దసరాకి ప్లాన్ చేసుకుంటే ఏ గొడవా ఉండదని భావిస్తున్నారు. సమస్యల్లా `వి` సినిమాదే. ఉగాదికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ.. లాక్ డౌన్ వల్ల సాధ్యం కాలేదు. లాక్ డౌన్ ఎత్తేశాక… ఈ సినిమాని విడుదల చేసేయాలా, లేదంటే.. దాన్ని కూడా తీరిగ్గా బయటకు వదలాలా అన్నది దిల్ రాజు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు.