నిర్మాతలకూ – ఓటీటీకీ మధ్య నిలబడింది హీరోలే. అవును.. థియేటర్ల కంటే ఓటీటీ వేదికల్ని నమ్మడం నిర్మాతల ముందున్న చక్కటి మార్గం. ల్యాబుల్లో ఆగిపోయిన తమ సినిమాని కాస్త ఇటు అటుగా క్యాష్ చేసుకోగల అవకాశం నిర్మాతల చేతుల్లో ఉంది. మరీ ముఖ్యంగా చిన్న, మీడియం సైజు సినిమాలకు. సినిమాల్ని ఇప్పుడు ఓటీటీ చేతుల్లో పెట్టుకుని, ఎంతో కొంత రాబట్టుకోవాలా – లేదంటే… పరిస్థితులు చక్కబడే వరకూ ఆగాలా? అనే విషయంలోనే నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అమేజాన్, జీ 5 సంస్థలు ఇప్పటికే ఫ్యాన్సీ రేట్లతో నిర్మాతలతో బేరాలకు దిగాయి. కొంతమంది `ఓఎస్…` అనుకున్నా – కేవలం హీరోల ఒత్తిడితోనే వెనకడుగు వేస్తున్నారు. ఇంకొంత మంది దర్శకుల మాటకు తలొగ్గుతున్నారు.
ప్రతీ హీరోకీ, దర్శకుడికీ తన సినిమాపై అపారమైన ప్రేమ, నమ్మకం ఉంటాయి. వాళ్ల భవిష్యత్తు అదే. సినిమా విడుదలై, థియేటర్లో బాగా ఆడితే తదుపరి సినిమాకి మైలేజీ పెరుగుతుంది. పారితోషికాలు పెరుగుతాయి. అలా కాకుండా తమ సినిమా ఓటీటీకి పరిమితమైందంటే – తమ క్రేజ్ తగ్గిందేమో అన్న సంకేతాలు వెళ్లిపోతాయి. ఇదీ.. వాళ్ల భయం. పైగా థియేటరికల్ రికార్డ్స్ కి ఎనలేని ప్రత్యేకత, ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు. గత సినిమా కంటే ఈ సినిమా ఎక్కువ వసూలు చేసిందని చెప్పుకోవడం తప్పనిసరి అయిపోయింది. ఇది వరకు ఈ జాఢ్యం పెద్ద హీరోల సినిమాలకే పరిమితమయ్యేది. ఇప్పుడు అలా కాదు. ప్రతీ హీరోకీ `కెరీర్ బిగ్గెస్ట్ హిట్` అనే పోస్టర్ వేసుకోవాలన్న తపన ఉంది. థియేటరికల్ రిలీజ్ జరిగితే… ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఓటీటీలో కూడా రికార్డుల గోల ఇంకా రాలేదు కాబట్టి – వాటిపై మన హీరోల మనసు పోవడం లేదు.
కానీ నిర్మాతల బాధ వేరు, భయం వేరు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఎదురు తిరుగుతాయో చెప్పలేం. ఇప్పుడు తమ వెంట పడుతున్న ఓటీటీ సంస్థల్ని నిర్లక్ష్యం చేస్తే.. రేపొద్దుట సినిమాని అమ్ముకోవాలనుకున్నప్పుడు తమని పట్టించుకోరేమో అన్నది వాళ్ల భయం. ఓటీటీకి అమ్ముకోవడం వల్ల నిర్మాతలకు భారీ లాభాలేం రావు. అలాగని భరించలేని నష్టాలూ వస్తాయని చెప్పలేం. కాస్త అటూ ఇటూగా ప్లస్ ఆర్ మైనస్ లతో సర్దుకుపోతారు. కొంతమంది నిర్మాతలకు రిస్కు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కాకపోతే హీరోలు, దర్శకుల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. నిర్మాతల భయాల్ని, ఇబ్బందుల్నీ హీరోలూ దృష్టిలో ఉంచుకోవాలి. ఓటీటీలోని నేరుగా సినిమాని విడుదల చేసుకోవడం తప్పో, క్రేజ్ తగ్గడమో అని భావించే అవసరం లేదు. ఓటీటీదే భవిష్యత్తు అని బల్లగుద్ది చెబుతున్న యువ హీరోలు.. వాస్తవ పరిస్థితినీ అర్థం చేసుకుని, తమ మాటల్ని చేతల్లో చూపించగలిగితే కొంతమంది నిర్మాతలైనా గట్టెక్కగలుగుతారు. థియేటర్ రిలీజ్ లేకపోయినా.. మనకు ఓటీటీ ఉందన్న నమ్మకం నిర్మాతలకూ కలుగుతుంది.