మూడు వారాల కిందట.. రాత్రికి రాత్రి లాక్డౌన్ విధించేశారు. ఎక్కడివారు అక్కడ ఉండిపోవడం అంటే… స్వతంత్ర భారతంలో సాధ్యం కాదు. భారత్లో ప్రతీ ఒక్కరికి ఇల్లు ఉండదు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు ఏమైనా ఉంటే… ఆ ఇల్లు ఉన్న చోట ఉపాధి ఉండదు. ఉపాధి కోసం.. నగరాలకు వెళ్లి ఎక్కడో చోట తలదాచుకోవాల్సిందే. రోజూ పని చేసి పొట్టపోసుకోవాల్సిందే. కోట్ల మంది ఉండే ఇలాంటి వలస కూలీల పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా మారుతోంది. లాక్ డౌన్ తీసేస్తారేమో.. రైళ్లు నడుపుతారేమోనన్న ఉద్దేశంతో.. ముంబై బాంద్రా రైల్వే స్టేషన్కు కొన్ని వేల మంది కూలీలు తరలి వచ్చారు. ఎవరో మోటివేట్ చేస్తేనే తీసుకొచ్చారన్న విమర్శలు వస్తున్నా… వారిలో సొంత ఊరికి వెళ్లి.. కడుపు నింపుకోవచ్చన్న ఆశ వారిలో ఉన్నది మాత్రం.. వాస్తవం. అందుకే… పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలల నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాలకు కూలీలు పోటెత్తుతారు. ఉన్న పళంగా లాక్ డౌన్ ప్రకటించేసిన తర్వాత వారి గురించి కనీసం.. ఓ అరగంట పాలకులు ఆలోచించినట్లయితే ఎలాంటి సమయ్యలు ఉండేవి కావు. వారేమీ.. నష్టపరిహారాలు.. ఆర్థిక ప్యాకేజీలు కోరుకోరు. నిత్యావసరాలు అందిస్తే చాలనుకుంటారు. అవి కూడా దొరకని పరిస్థితి ఉంది కాబట్టే.. పెద్ద ఎత్తున జనం సొంత ఊళ్లకు పయనమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో… ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వలస కూలీలు..లాక్ డౌన్ పొడిగింపు ప్రకటన తర్వాత వందల మంది నడుచుకుంటూ… బయలుదేరారు. పూట గడవడం కష్టం అవడం … ఎన్నాళ్లు ఇలాంటి పరిస్థితి ఉంటుందో తెలియకపోడమే ఈ పరిస్థితి కారణం.
ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేయడంలో పక్ష పాతం ప్రదర్శిస్తున్నాయి. అవసరమైన వారికి అన్ని మినహాయింపులు ఇస్తున్నాయి. కానీ..ఇలాంటి కూలీలను.. మాత్రం అటూ ఇటూ కదలకూడదని ఆంక్షలు పెడుతున్నాయి. ఇలాంటి వారు.. గుంపులుగా తిరగడం ప్రమాదకరమని ప్రభుత్వాలకూ తెలుసు. ఇలాంటి సమయంలో.. వారి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చి భరోసా కల్పించడమో.. పరీక్షలు చేసి.. సొంత ఊళ్లకు తరలించడమో చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వారు ఓటర్లు మాత్రమే… ఓట్లేసేటప్పుడు.. ఎంతో కొంత ఇస్తున్నాం కాబట్టి… వారికి తర్వాత పెద్దగా చేయాల్సిందేమీ లేదనుకునే ఆలోచనలో ప్రభుత్వాలు ఉంటే మాత్రం.. వాళ్ల సమస్యలు ఎప్పటికీ తీరవు. వారు వైరస్ బారిన పడితే మాత్రం..జరిగే నష్టాన్ని అంచనా వేయడం కష్టం.