మన దేశంలో జింబాబ్వే గురించి రెండు విధాలుగా తెలుసు. ఒకటి క్రికెట్ పరంగా.. రెండు అక్కడ కరెన్సీ కేంద్రంగా జరిగిన వ్యవహారాల పరంగా. క్రికెట్లో మంచి మంచి ప్లేయర్లు ఉన్న జింబాబ్వే.. ఆ దేశ రాజకీయాల కారణంగా అంర్థానం అయిపోయింది. అదే రాజకీయాల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. కరెన్సీకి విలువ లేకుండా పోయింది. లారీల్లో కరెన్సీ తీసుకు వచ్చి… నిత్యావసర సామాన్లు కొనుక్కోవాల్సిన దుస్థితి అక్కడి ప్రజలకు ఏర్పడింది. దీనంతటికి కారణం… హెలికాఫ్టర్ మనీనే. అదే పదం వాడకపోవచ్చు కానీ.. ఇష్టం వచ్చినట్లుగా నోట్లు ప్రింట్ చేసి.. ప్రజలకు పంచడంతో.. దానికి విలువ లేకుండా పోయి.. ఉత్పాదకత తగ్గిపోయి.. చివరికి ప్రజల్ని బికారుల్ని చేసేసింది.
డబ్బులు ప్రింట్ చేసి పంపిణీ చేసేస్తారా..?
హెలికాఫ్టర్ మనీ అంటే.. ప్రజలకు నేరుగా పెద్ద ఎత్తున నగదును అందుబాటులోకి తీసుకెళ్లడం. ప్రస్తుతం వైరస్ కారణంగా ప్రజలందరి ఉపాధి దెబ్బతిన్నది. వారికి ఆదాయం లేదు. ఖర్చు పెట్టడానికి వారి వద్ద డబ్బుల్లేవు. మళ్లీ దేశంలో పరిస్థితి ఎప్పుడు గాడిన పడుతుందో తెలియదు. ఈ గండాన్ని గట్టెక్కాలంటే.. ప్రజలకు పెద్ద ఎత్తున నగదు అందాబాటులోకి తేవాలి. లక్షల కోట్లు ప్రజలకు చేరిస్తే మళ్లీ అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగి.. ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే కేసీయార్ డబ్బులు ప్రింట్ చేసి ఇవ్వమని చెప్పలేదు. కానీ.. అంతకుమించిన మార్గం దేశానికి లేదు. మరి మన దేశ ప్రభుత్వం ఎక్కడ్నుంచి తెచ్చి ప్రజలకు పంచుతుంది. ఇప్పుడు ఆర్బీఐ వద్ద నిధుల్లేవు. ఉన్న రిజర్వ్ నిధుల్లో .. దాదాపుగా సగం.. ఇటీవలే.. రూ. లక్షా 75వేల కోట్లు ఖజానాకు మళ్లించుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే రిజర్వ్ బ్యాంక్ వద్ద కూడా నిధుల్లేవు. క్వాంటీటేటివ్ ఈజింగ్ పద్దతిలో రాష్ట్రాలకు నిధులకు సమకూర్చాలన్నా… ప్రింట్ చేయడం తప్ప ఆర్బీఐ వద్ద నిధుల్లేవు.
జీడీపీ లేకుండా మనీ ప్రింట్ చేస్తే వినాశనమే..!
భారతదేశంలో.. నోట్లను ప్రింట్ చేయడానికి ఆర్బీఐకి మాత్రమే అధికారం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ మన దగ్గర ఉన్న బంగారం నిల్వలు, విదేశీ మారక ద్రవ్య నిల్వులు, జీడీపీ లెక్కల ఆధారంగా నగదును ప్రింట్ చేస్తుంది. నోట్లు ప్రింట్ చేసి ప్రజలకు పంచితే.. ప్రజల దగ్గర పేరుకు కరెన్సీ నోట్లు ఉంటాయి తప్పించి వాటికి ఏమాత్రం విలువ ఉండదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించింది. భారత ఆర్థిక పరిస్థితి దిగజారింది. రాష్ట్ర ప్రభుత్వాల వద్దే కాదు.. కేంద్రం వద్ద కూడా డబ్బుల్లేవు. దేశంలో ఉత్పాదకతకు సంబంధం లేకుండా అధికంగా డబ్బులు ప్రింట్ చేస్తే.. అవి చిత్తుకాగితాలతో సమానంగా మారుతాయి. అది దేశ వినాశనానికి దారి తీస్తుంది. హెలికాఫ్టర్ మనీ కావాలంటే.. ఖచ్చితంగా.. జీడీపీని.. పట్టించుకోకుడా డబ్బులు ప్రింట్ చేయాలి. అది చేస్తే ఇండియా మరో జింబాబ్వే అయినా ఆశ్చర్య పోనవసరం లేదు.
ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలకు.. మన ఆర్థిక వ్యవస్థకు తేడాలు గుర్తించాలి..!
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. తమ దేశంలో కరోనా విలయం కారణంగా ప్రజలకు ఓ ప్యాకేజీ ప్రకటించారు. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆర్థిక సాయం చేశారు. పెద్దవాళ్లకు 1200 డాలర్లు చిన్న పిల్లలకు 500 డాలర్లను అందించాలని నిర్ణయించారు. ఇదంతా హెలికాఫ్టర్ మనీనే కావొచ్చు. అయితే అమెరికా ఇచ్చిందని.. మరో అభివృద్ధి చెందిన దేశం ఇచ్చిందని.. మన దేశం కూడా అలా చేస్తే.. మొదటికే మోసం వస్తుంది. అమెరికా వంటి దేశాన్ని చూసి అక్కడి ఆర్థిక విధానాలను పాటిస్తే.. ఆ విధానాలు మనకు సరిపడతాయా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. అమెరికా డాలర్ ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అయితే అంతిమంగా అది.. అమెరికాకు చేరాల్సిందే. ఇప్పుడు కాకపోయినా.. దీర్ఘ కాలంలో అమెరికాకు చేటు చేస్తుందనేది మాత్రం నిజం.