ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిర్బంధ ఇంగ్లిష్ మీడియం నిర్ణయం న్యాయపరీక్షలో నిలబడలేకపోయింది. ఈ మేరకు జారీ చేసిన 81, 85 నెంబర్ జీవోలను కొట్టి వేస్తూ.. హైకోర్టు నిర్ణయం ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి.. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంకు చాన్స్ లేకుండా చేయాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు గండి పడినట్లయింది. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఏ మీడియంలో చదవుకోవాలన్నది విద్యార్థుల ఇష్టమని.. నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియంలో చదవుకోవాలని చెప్పడం… చట్టాల ఉల్లంఘనే అంటూ పలురువు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండలానికో.. తెలుగు మీడియం పాఠశాల ఉంచుతామని… ఆ స్కూళ్లలోచదువుకునే వారికి ప్రత్యేకంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే హైకోర్టు సంతృప్తి చెందలేదు. తప్పనిసరి ఇంగ్లిష్ గా ప్రకటిస్తూ.. ఇచ్చిన జీవోలను కొట్టి వేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే బోధించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. మాతృభాషను చంపేస్తున్నారని ఓ వైపు… మత కోణం జోడిస్తూ.. మరో వైపు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏ మీడియంలో చదవాలో అన్నది పిల్లలకు.. తల్లిదండ్రులకు వదిలేయాలని..అన్ని మీడియంలను స్కూళ్లలో అందుబాటులో ఉంచారని… విపక్ష నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే.. పేదలకు ఇంగ్లిష్ మీడియం వద్దా అంటూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేస్తూ.. దూకుడుగా జీవోలు విడుదల చేశారు. అయితే.. కేంద్ర విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఏ మీడియంలో చదువుకోవాలనేది.. వారి ఇష్టం.
నిజానికి తప్పనిసరి ఇంగ్లిష్ మీడియం బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది మండలిలో ఆమోదం పొందలేదు. ఈ బిల్లుకు శాసనమండలి సవరణలు సూచిస్తూ తిప్పి అసెంబ్లీకి పంపింది. ఏ మీడియంలో చదువుకోవాలో విద్యార్థే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించేలా చట్టాన్ని సవరించాలని మండలి సూచించింది. ఓ సారి మండలి తిప్పి పంపినా మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. నిబంధనల ప్రకారం.. ఆమోదం పొందినట్లేనని చెప్పి.. జీవోలు విడుదల చేశారు. చివరికి హైకోర్టు కొట్టి వేసింది.