వెబ్ సిరీస్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ విలువ ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది జనాలకు. ఈ లాక్ డౌన్ వేళ ఇంటిల్లిపాదికీ వినోదాన్నీ, కాలక్షేపాన్నీ అవే అందిస్తున్నాయి. వాటి మైలేజీ ఏమిటన్నది అందరికీ అర్థమైంది. అందుకే.. బడా నిర్మాతలంతా ఇప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. శరత్ మరార్ నుంచి `అసలేం జరిగిందంటే` అనే వెబ్ సిరీస్ బయటకు వచ్చింది. ఆయన మరికొన్ని సిరీస్‌లను ప్లాన్ చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ వృక్షంలో ఎదుగుతున్న మరో నిర్మాణ సంస్థ స్వప్న సినిమా. ఈ సంస్థ కార్యకలాపాలన్నీ అశ్వనీదత్ కుమార్తెలు చూసుకుంటున్నారు. వాళ్లిప్పుడు ఓ వెబ్ సిరీస్‌ని రూపొందించే పనిలో ఉన్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈమధ్య గట్టిగా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. వాళ్ల దగ్గర చాలా కథలు రెడీగా ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేయగానే ఒకేసారి రెండు ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఇప్పటికే చదరంగం అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి. డివివి దానయ్య, భోగవల్లి ప్రసాద్ లాంటి భారీ నిర్మాతలు కూడా పనిలో పనిగా ఈ రంగంలోకి దిగిపోతున్నారు.
సినిమాకి పడే కష్టమే వెబ్ సిరీస్‌కీ ఉంటుంది. కానీ.. సినిమా విడుదల చేయడానికి పడే కష్టాలు మాత్రం దీనికి ఉండవు. కంటెంట్ నచ్చితే… అమేజాన్ లాంటి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నాయి. వాళ్ల ప్లానింగులన్నీ భారీగానే ఉంటాయి. జస్ట్.. ఇక్కడో నిర్మాత అండ దండలు కావాలంతే. వెబ్ సిరీస్ పూర్తి చేసి, ఆ తరవాత మంచి రేటుకి అమ్ముకోవచ్చు. పైగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇప్పుడు కంటెంట్ లేక విలవిలలాడుతున్నాయి. అందుకే ఇంత మార్పు వచ్చింది.