వకీల్ సాబ్ లో పవన్ కల్యాణ్ – శ్రుతిహాసన్ని జంటగా చూడాలనుకున్నారు మెగా అభిమానులు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఖాయమైపోయిందని, పవన్ – శ్రుతిల జంట హ్యాట్రిక్ కొట్టబోతోందని వార్తలు గట్టిగా వచ్చాయి. అయితే శ్రుతి మాత్రం `ఈ సినిమాలో నేను పనిచేయడం లేదు` అని బాంబు పేల్చింది. దాంతో.. వకీల్ సాబ్ లో శ్రుతి నటించడం పుకారే అనుకున్నారు జనాలు.
అయితే నిజానికి ఈ సినిమా కోసం శ్రుతి హాసన్ సంతకాలు చేసిందట. ఎగ్రిమెంట్లు అన్నీ పూర్తయ్యాయని కానీ శ్రుతి హాసన్ అలా ఎందుకు చెప్పిందో అర్థం కావడం లేదని `వకీల్ సాబ్` చిత్రబృందం చెబుతోంది. ఎగ్రిమెంట్లు అయ్యాక శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకుందా, లేదంటే చిత్రబృందమే అధికారికంగా ప్రకటించే వరకూ ఈ సినిమా విషయంలో మౌనంగా ఉండాలనుకుందా? అనేది అర్థం కావడం లేదు. నిజానికి మౌనంగా ఉండాలనుకుంటే మాత్రం ‘చర్చలు జరుగుతున్నాయి’ అనో, ‘ఆ విషయం నిర్మాతలే చెప్పాలి’ అనో సమాధానాన్ని దాటేయాలి. అంతే తప్ప, సినిమా చేయట్లేదంటే అభిమానులు కన్ఫ్యూజ్ అవ్వరూ…? తమ సినిమాలో ఇప్పటికీ కథానాయిక శ్రుతి హాసనే అంటోంది చిత్రబృందం. మరి శ్రుతి ఈ డబుల్ గేమ్ ఎందుకు అడుతుందో?