ఏమాటకామాట చెప్పుకోవాలి. దాసరి నారాయణరావు ఉద్దండుడు. ఎవర్ని ఎలా డీల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. అసలు సెట్లో దర్శకుడికంటూ ఓ గౌరవం తెచ్చుకున్నది, దాన్ని నిలబెట్టుకున్నదీ, దర్శకులకు స్టార్ డమ్ తీసుకొచ్చిందీ ఆయనే. ఈ లక్షణాలు దాసరిలో ముందు నుంచీ ఉన్నాయి. దాసరి తన రెండో సినిమాలోనే తన పట్టుదలని చూపించుకున్నారు.
దాసరి తొలి చిత్రం ‘తాత- మనవడు’. సూపర్ హిట్. రెండో సినిమా.. ‘సంసారం – సాగరం’. ఇందులో కూడా ఎస్వీ రంగారావు కీలక పాత్ర పోషించారు. అందులో కాబూలీవాలాగా కనిపించారు. తొలి రోజు షూటింగ్‌లోనే దాసరికీ, ఎస్వీఆర్‌కీ వాగ్వీవాదం జరిగింది. దాసరి చెప్పిన చాంతాడంత డైలాగ్‌ని విన్న ఎస్వీఆర్.. ‘ఇంత అవసరం లేదు.. దాన్ని కట్ చేస్తా.. కుదించి చెప్తా’ అన్నార్ట. దానికి దాసరి “సార్ ఇది సినిమాలో ఆర్డరు ప్రకారం వచ్చే 99వ సీన్. 98 సీన్లు రాసిన వాడిగా 99వ సీన్లో ఏం రాస్తే బాగుంటుందో, ఎంత రాయాలో నాకు తెలుసు. ఇంతకు ముందు 98 సీన్లూ ఎలా ఉంటాయో మీకు తెలీదు . అందుకే ఇలా మాట్లాడుతున్నారు” అన్నాడట. ఎస్వీఆర్‌కి చాలా కోపం వచ్చేసింది. అప్పటికి దాసరి వయసు, అనుభవం ఎంతని. ఒకే ఒక్క సినిమా. ఇటు ఎస్వీఆర్ మామూలు వ్యక్తా? ఆయన అనుభవం ముందు దాసరి ఎంత? ఈ విషయం దాసరికీ తెలుసు. కానీ డైలాగు మార్చకపోవడం ఎస్వీఆర్‌కి కోపం వచ్చేసింది. దాంతో “ఈ సినిమా నేను చేయను” అంటూ అలిగి బయటకు వెళ్లిపోయారు.
ఈ సినిమాకి కె.రాఘవ నిర్మాత. ఆయనకీ ఎస్వీఆర్‌కీ మంచి దోస్తీ ఉంది. ఎస్వీఆర్ మనస్తత్వం ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన స్థానంలో అప్పటికప్పుడు రావుగోపాలరావుతో ఆ పాత్ర వేయించాలనుకున్నారు. వెంటనే రావుగోపాలరావు కూడా సెట్‌కి వచ్చారు. కానీ అప్పటికి సెట్లో ఎస్వీఆర్ కూర్చుని ఉన్నారు. రావు గోపాలరావు సెట్‌కి ఎందుకు వచ్చాడో ఎస్వీఆర్‌కి అర్థమైంది. “ఏంటి ఇలా వచ్చావు?” అని గద్దిస్తూనే అడిగార్ట. దానికి రావుగోపాలరావు భయపడిపోయి.. “ఏం లేదు సార్… మిమ్మల్ని పలకరిద్దామని వచ్చా” అని మాట మార్చి అక్కడి నుంచి తుర్రుమన్నార్ట.
వెంటనే.. ఎస్వీఆర్ దాసరిని పిలిపించార్ట. డైలాగు మార్చే ఉద్దేశం ఉందా, లేదా? అని ఈసారి ఇంకొంచెం సీరియస్ గా అడిగితే… “మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి. కానీ.. ఈ సన్నివేశానికి ఇంత పెద్ద డైలాగ్ అవసరం. సినిమా అంతా చూశాక, మీకు నచ్చకపోతే అప్పుడు మారుస్తానేమో. ఇప్పుడు మాత్రం మార్చను” అన్నార్ట. దాసరి మొండితనం చూసి ఎస్వీఆర్ ముచ్చటపడిపోయార్ట. “నేను ఇంత కసురుకున్నా.. నువ్వు కరగలేదంటే గట్టోడివే.. పైకొస్తావ్” అని మెచ్చుకుంటూ.. దాసరి రాసిన డైలాగ్ లో అక్షరం కూడా మార్చకుండా చెప్పేశార్ట. దట్ ఈజ్ దాసరి.