ఇంగ్లిష్ మీడియం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ సర్కార్కు నచ్చలేదు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మంత్రి హైకోర్టు తీర్పుపైనా… రాజకీయ పద్దతిలోనే స్పందించారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవొద్దా.. అనే పాత ప్రశ్నను సంధించారు. ఒక్కసారి మాట ఇస్తే జగన్ చేసి తీరతారని.. తాము సుప్రీంకోర్టుకు వెళ్లి నిర్బంధ ఇంగ్లిష్ మీడియంను అమలు చేస్తామని ప్రకటించారు. అన్ని స్కూల్స్లో ఇంగ్లిష్ మీడియంపై పేరెంట్స్ కమిటీలు తీర్మానాలు చేసి పంపాయని… ఇప్పటికే లక్ష మంది టీచర్లకు శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు.
తెలుగుదేశం పార్టీ హైకోర్టు తీర్పును కూడా రాజకీయం చేస్తోందని.. తీర్పు విజయంగానో, అపజయంగానో భావించవద్దన్నారు. రాజ్యాంగం ప్రకారం.. ప్రాధమిక హక్కు అయిన విద్యలో… ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో జరగాలని.. కేంద్ర విద్యాహక్కు చట్టంలో ఉంది. ఇంత వరకూ ఏ రాష్ట్రమూ దీన్ని కాదని.. మాతృభాషను నిషేధించలేదు. న్యాయపరీక్షలో నిలబడదని తెలిసినప్పటికీ.. ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు.. హైకోర్టు కొట్టివేయడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయింది.
కొద్ది రోజుల కిందట… కార్యాలయాలకు వైసీపీ రంగులపై.. హైకోర్టు తీర్పుపై .. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించడంతో రంగులు మార్చడం ప్రారంభించారు. స్థానిక ఎన్నికలపైనా.. సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయని… ఏ మీడియంలో చదువుకోవాలో ఆప్షన్స్… విద్యార్థులకు,తల్లిదండ్రులకు ఇవ్వాల్సిందేనని న్యాయనిపుణులు చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.