దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్స్పాట్ (రెడ్ జోన్) జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 170 జిల్లాలను హాట్స్పాట్ కేంద్రాలుగా ప్రకటించింది. ఏపీలో 11 జిల్లాలు.. తెలంగాణలో 8 జిల్లాలను హాట్స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. జిల్లాల వారీగా కేంద్రం.. కరోనా పాజిటివ్ లెక్కలను తీసుకుని ఖరారు చేసింది. ఏపీలో ఉన్న మొత్తం పదమూడు జిల్లాల్లో పదకొండు జిల్లాలను.. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న హాట్ స్పాట్లుగా తేల్చారు. ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఈ జాబితాలో లేవు.
ప్రధానమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలాల వారీగా… రెడ్ జోన్ల లెక్క చెప్పారు. ఏపీలో కేవలం 37 మండలాల్లోనే రెడ్ జోన్ ఉందని… ఆయా మండలాల్లో మాత్రమే.. లాక్ డౌన్ కొనసాగిస్తే చాలన్న అభిప్రాయాన్ని వినిపించారు. కానీ.. కేంద్రం మాత్రం జిల్లాల వారీగానే పరిశీలన జరిపింది. ఆ మేరకు ప్రకటన చేసింది. ఇరవై కేసులు మాత్రమే నమోదయ్యాయని..అందులో నలుగురు డిశ్చార్జ్ అయ్యారని.. యాక్టివ్ కేసులు పదహారు మాత్రమే ఉన్నాయని విశాఖ గురించి ప్రభుత్వం చెబుతోంది. అయితే.. హాట్ స్పాట్ గా… ఆ జిల్లాను కేంద్రం గుర్తించింది.
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల పరిధిలో ఎనిమిది జిల్లాలు హాట్ స్పాట్ గా గుర్తించారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్ హాట్ స్పాట్ జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇరవయ్యే తేదీ నుంచి కొన్ని లాక్ డౌన్ మినహాయింపులను కేంద్రం ప్రకటించింది. ఈ హాట్ స్పాట్ల పరిధిలో లేని వారు.. ఈ మినహాయింపులు పొందవచ్చు. హాట్ స్పాట్ జిల్లాల్లో మాత్రం కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తారు.