నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది గానీ, లేదంటే ఈ పాటికి ఫస్ట్ లుక్ సైతం బయటకు వచ్చేసేది. ఈ సినిమా మొదలవ్వకుండా స్టోరీ లైన్ కూడా లీకైంది. బాలకృష్ణ రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారని, అందులో అఘోరా గెటప్ ఒకటని ప్రచారం జరిగింది. అది నిజం కూడా. ఇంట్రవెల్ బ్యాంగ్ ముందు బాలయ్య అఘోరా గెటప్‌కి సంబంధించిన సన్నివేశాలు మొదలవుతాయి. ద్వితీయార్థం లో దాదాపు సగం వరకూ కథ అఘోరా గెటప్ చుట్టూనే తిరుగుతుంది. బాలయ్యకి ఆ గెటప్ సెట్ అవుతుందా, లేదా? అఘోరాగా బాలయ్యని చూడగలమా, లేదా? అంటూ స్వయంగా బాలయ్య ఫ్యాన్సే ఆందోళన చెందారు. గెటప్ ఏమాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుందని భయపడ్డారు. ఈ సంగతి చిత్రబృందం వరకూ వెళ్లింది. ఈ విషయమై దర్శక నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నారు. చివరికి అఘోరా గెటప్‌కి సంధించిన సన్నివేశాల నిడివి తగ్గించాలన్న నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
అఘోరాకి సంబంధించిన ఎపిసోడ్ వీలైనంత వరకూ కుదించారని సమాచారం. ఆ గెటప్కూడా ముందుగానే రివీల్ చేసి, బాలయ్య ఫ్యాన్స్‌ని ప్రిపేర్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. లాక్ డౌన్ ఇబ్బంది లేకపోతే దసరాకి ఈ సినిమా రావాల్సింది. షూటింగ్ ఎప్పుడు మొదలైనా, దసరాకే ఈ సినిమాని తీసుకొస్తామని దర్శకుడు బోయపాటి గట్టిగా చెబుతున్నారు. అటూ ఇటూ అయితే గనుక.. సంక్రాంతి రేసులో ఈ సినిమాని చూడొచ్చు. సంక్రాంతి బాలయ్యకు అచ్చొచ్చిన సీజన్. కాబట్టి.. ఆ సెంటిమెంట్ కూడా బాలయ్యకు కలిసొచ్చే ఛాన్సుంది.