ఆంధ్రప్రదేశ్ సర్కార్కు ఇప్పటికి 50 సార్లకుపైగా కోర్టు మొట్టికాయలు వేసింది. చట్టాలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చారని.. నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడింది. స్వతంత్ర భారతదేశంలో ఓ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఇన్ని ఎదురు దెబ్బలు తగలడం ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి జగన్కు పరిపాలనా అనుభవం లేదు. కానీ ఆయన నెలకు రూ. లక్షల్లో జీతాలు ఇచ్చి ప్రతీ విభాగానికి సలహాదారులను పెట్టుకున్నారు. న్యాయస్థానాల్లో పడుతున్న మొట్టికాయలల్లో అత్యధిక క్రెడిట్ వారికే దక్కాలి. చట్టాలు, రాజ్యాంగం గురించి.. నిబంధనల గురించి సలహాదారులు ఎందుకు .. అర్థమయ్యేలా సీఎంకు చెప్పలేకపోతున్నారన్నదే ఇక్కడ కీలకమైన అంశం.
ప్రజాస్వామ్య దేశంలో ఇంగ్లిష్ నిర్బంధం చేయడం సాధ్యమా..?
ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా ఏర్పడుతుంది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణం… చట్టాలకు అనుగుమంగా పాలన చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలను.. చట్టాలు తమకు వర్తించవన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అనేక విషయాల్లో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు చట్ట విరుద్ధమని న్యాయస్థానాలు తేల్చడమే దీనికి కారణం. తాజాగా.. విద్యా హక్కు చట్టానికి వ్యతిరేగంా.. నిర్బంధ ఇంగ్లిష్ మీడియం జీవోలను విడుదల చేశారని నిర్ధారిస్తూ.. హైకోర్టు వాటిని కొట్టి వేసింది. ఏకంగా రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. దేశంలో నిర్బంధ ఓటు హక్కే లేదు.. అలాంటిది అందరూ నిర్బంధంగా ఇంగ్లిషే చదవాలని తేల్చడం.. రాజ్యాంగ విరుద్ధం. అందులో సందేహం లేదు. ఈ విషయాన్ని సలహాదారులు ఎందుకు జగన్కు చెప్పలేకపోయారో..?
కోర్టు తీర్పులు చట్ట విరుద్ధమైన పాలనకు సాక్ష్యాలే..! /span>
ప్రభుత్వం గత పది నెలల కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాలు.. విడుదల చేసిన జీవోలు.. చట్ట విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానాలు చెబుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న 50 కిపైగా నిర్ణయాలను.. కోర్టు ఆక్షేపించింది. రాజధాని తరలింపు దగ్గర్నుంచి బార్ల లైసెన్సుల రద్దు వరకూ.. అనేక విషయాన్ని కోర్టు మొట్టికాయలు వేసింది. అయినా ప్రభుత్వం తీరు మాత్రం మారలేదు. వివాదాస్పద నిర్ణయాలు.. రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు మరో మాట లేకుండా తేల్చేస్తున్న అంశాల్లోనూ.. చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటన్నింటిపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. కోర్టుల్లో ఎదురు దెబ్బలు తిన్నా.. తాము చేయాలనుకున్నది తాము చేస్తామన్నట్లుగా జగన్ వ్యవహారశైలి ఉంది.
కోర్టు తీర్పులనూ లెక్క చేయకుండా ముందుకెళ్తూ దూకుడు..!
ప్రధాన నిర్ణయాలన్నీ కోర్టుల్లో తేలిపోతూండటతోనే… ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టమవుతోంది. అయితే.. అలాంటి నిర్ణయాల విషయంలో.. ఎక్కడా ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్న సూచనలు లేవు. రాజధాని భూముల్లో ఇతరులకు ఇళ్ల స్థలాలొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా.. అక్కడ మార్కింగ్ వేయడం వంటి పనులు చేశారు. ఇతర విషయాల్లోనూ అదే విధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది. తాజాగా హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినా ఇంగ్లిష్ మీడియం అమలు చేసి తీరుతామని మంత్రి ప్రకటించేశారు.
సలహాదారులు జగన్కు మంచీ చెడూ చెప్పరా..?
151 సీట్లతో ప్రజలు తిరుగులేని అధికారం ఇచ్చారు. కానీ ఆ అధికారం.. రాజ్యాంగం ద్వారానే వచ్చింది. ఆ రాజ్యాంగానికి మించి అధికారం చెలాయిస్తామంటే సాధ్యం కాదు. ముఖ్యమంత్రికి సలహాదారులు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాల్సి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.