దర్శకుడనేవాడు మొండిగా ఉండాలి. తనే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆ మాత్రం మొండితనం ఉండాల్సిందే. కానీ కొంతమంది ఉంటారు.. వాళ్లు జగమొండులు. సర్దుకుపోవడాలు, పోనీలే అనుకోవడాలూ వాళ్లకు అస్సలు తెలీవు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, దాని వల్ల ఎంత నష్టమైనా భరిస్తారు. తమ మాట విననివాళ్లపై వాళ్లకు తెలియకుండానే సైలెంట్‌గా ప్రతీకారాలు కూడా తీర్చుకుంటారు. రవిబాబు అలాంటి వాడే.
ఇది… ‘అవును’ నాటి సంగతి. అప్పటికే 12 రోజుల షూటింగ్ పూర్తయ్యింది. పదమూడో రోజు షవర్‌కి సంబంధించిన షాట్స్ తెరకెక్కించాలి. పూర్ణ హీరోయిన్. అద్దం అవతల పూర్ణ స్నానం చేస్తుంటే, అద్దం ఇవతల కెమెరా పెట్టారు. తెరపై ఆ సన్నివేశం ఎలా వస్తుందో ముందే పూర్ణకు డమ్మీ షాట్స్ తీసి చూపించారు. ‘సీన్లు ఇలా వస్తాయి.. నువ్వు నటించడానికి రెడీయేనా’ అని ముందే పూర్ణని ప్రిపేర్ చేశాడు రవిబాబు. షూటింగ్ మొదలైంది. పూర్ణ అద్దం అవతలకెళ్లి టవల్ చుట్టుకుని స్నానం చేయాలి. కెమెరా రోల్ అయ్యిందో లేదో, పూర్ణ బయటకు వచ్చేసింది. ‘ఈ సన్నివేశం నేను చేయలేను’ అంది. ‘అదేంటి? నీకు ఇంత వివరంగా చెప్పా కదా. షాట్ ఎలా ఉంటుందో నువ్వు కూడా చూశావు, సరే అన్నావు. ఇప్పుడేంటి సమస్య’ అని నచ్చజెప్పడానికి చూశాడు రవిబాబు. కానీ పూర్ణ వినలేదు. ‘చేయనంటే చేయను’ అని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
వెంటనే రవిబాబు పూర్ణ మేనేజర్నీ, ప్రొడక్షన్ వాళ్లనీ పిలిచి ‘పూర్ణకి ఏం ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో సెటిల్ చేసేయండి. కొచ్చికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేయండి.. మనం సినిమా ఆపేద్దాం. ఈ 12 రోజుల సినిమా పక్కన పెట్టి కొత్త అమ్మాయితో తీద్దాం’ అనేశాడట. ఈ మాటలన్నీ పూర్ణ చెవిన పడ్డాయి. దాంతో పూర్ణ దిగి వచ్చి – షూటింగ్‌కి సహకరించింది. ఆ తరవాత నుంచి రవిబాబుకీ, పూర్ణకీ మధ్య పెద్దగా మాటల్లేవు. సినిమా అంతా దాదాపుగా పూర్తయ్యింది. ఒక్క రోజు మాత్రమే షూటింగ్ బాకీ. ఆ డేట్లు ఇవ్వడానికి పూర్ణ దాదాపు నెల రోజులు తిప్పించుకుని రవిబాబుపై ప్రతీకారం తీర్చుకుంది.
చివరికి ఆ ఒక్కరోజూ కాల్షీట్లు ఇచ్చింది పూర్ణ. ఆ ఒక్కరోజులో ప్రమోషన్లకు సంబంధించి ఫొటో షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ‘అవును’ పోస్టర్లు గుర్తున్నాయి కదా. పూర్ణని ఓ మదపుటేనుగు తొండంతో బంధించేట్టు పోస్టర్ డిజైన్ చేశాడు రవిబాబు. అవన్నీ బ్లూ మేట్‌పై తీసిన ఫొటోలు. పూర్ణని గాల్లో వేలాడదీస్తూ… రకరకాల ఫోజుల్లో ఫొటోలు తీసి, ఆ తరవాత గ్రాఫిక్స్ లో వాటిని ఏనుగుతో యాడ్ చేయాలి. అందుకోసం రోప్స్ పై పూజని గాల్లో వేలాడదీశారు. కొన్ని గంటల సేపు. ఫొటోగ్రాఫర్ రకరకాల ఫోజుల్లో ఫొటోలు తీసుకున్నాడు. చివరికి పూర్ణని కిందకు దింపారు. ఆ ఫొటోలు ఎలా వచ్చాయో చూసుకోవాలని ఉంటుంది కదా. స్టిల్ ఫొటోగ్రాఫర్‌ని పిలిచి.. ఫొటోలు చూపించమన్నాడు రవిబాబు. కానీ.. విచిత్రం ఏమిటంటే… స్టిల్ ఫొటోగ్రాఫర్ కెమెరాలో మెమొరీ కార్డు పెట్టడం మర్చిపోయాడు. ఒక్క ఫొటో కూడా లేదు. దాంతో పూర్ణకు కోపం వచ్చేసింది. ఇదంతా రవిబాబు తనని ఇబ్బంది పెట్టడానికి చేశాడన్నది పూర్ణ అభిప్రాయం. తాను ఒక్క రోజు కాల్షీటు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టానని ప్రతీకారంగా రవిబాబు గంటల కొద్దీ గాల్లో వేలాడదీశాడని ఫిక్సయిపోయింది పూర్ణ. కానీ.. ఇందులో రవిబాబు తప్పేం లేదు. కేవలం ఫొటో గ్రాఫర్ చేసిన పొరపాటు. ఈ విషయం పూర్ణని నమ్మించడానికి రవిబాబు చాలా తిప్పలు పడాల్సివచ్చింది. చివరికి మరో గంట పాటు.. పూర్ణ గాల్లో వేలాలడం, ఫొటోగ్రాఫర్ స్టిల్స్ తీసుకోవడం జరిగాయి. ఆ సినిమా మంచి హిట్టయ్యింది. సీక్వెల్ కూడా వచ్చింది. ఆ తరవాత పూర్ణతో కొన్ని సినిమాలకు పనిచేశాడు రవిబాబు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ అది స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది.