కరెన్సీ నోట్ల నుంచి కూడా కరోనా రావొచ్చన్న వార్తలు ప్రజల్ని మరింత భయపెడుతున్నాయి. కరెన్సీ నోట్లని ముట్టుకోకుండా రోజు గడిచిపోతుందా? ఎంత డిజిటలైజేషన్కి అలవాటు పడుతున్నా – పచ్చనోటు పట్టుకోకపోతే ఎలా? పచ్చనోటుతో కరోనా వస్తుందనుకున్నప్పుడు దిన పత్రికలతో ఎందుకు రాదు..? ఇలా ఎన్నో భయలూ, గందరగోళాలూ. ఇప్పటికే కరోనా వల్ల ప్రింటు మీడియా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. పేపర్ ద్వారా కరోనా వ్యాప్తి కాదు.. అని ప్రింట్ మీడియా యాజమాన్యాలు ముక్త కంఠంతో చెప్పినా – ప్రజల్లో ఆ భయం పోలేదు. దాంతో శానిటైజర్ చల్లిన పత్రికలు బయటకు వచ్చాయి. అయినా సరే నూటికి 40 శాతం పేపర్ ముట్టుకోవడం మానేశారు. దాంతో సర్క్యులేషన్లు అమాంతం పడిపోయాయి. పేపర్ బరువు తగ్గింది. పేజీలు ఎత్తేశారు. ఉద్యోగుల్ని తీసేశారు. ఇప్పుడు కరెన్సీ కలకలంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్టైంది.
దిన పత్రికలపై శానిటైజర్ చల్లుతున్నారని తెలిసినా పేపర్ ముట్టుకోవడానికి జంకుతున్నారు పాఠకులు. ఇప్పుడు కరెన్సీ నోట్లతోనూ కరోనా వస్తుందంటే… మరింత భయం పట్టుకుంది. దాంతో సర్క్యులేషన్ మరింత పడిపోవడం ఖాయం. ఇవన్నీ యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పత్రికలు డిజిటల్ కి పరిమితమయ్యాయి. మే 3 వరకూ లాక్ డౌన్ కొనసాగిన ఈ నేపథ్యంలో మరి కొన్ని పత్రికలు `ఓన్లీ డిజిటల్` నినాదాన్ని నమ్ముకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈనాడు, సాక్షి లాంటి పెద్ద పత్రికలు సైతం ప్రింటింగ్ని ఆపేసి, కొంతకాలం డిజిటల్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే… కరోనా ప్రభావం తగ్గిన తరవాత సైతం పాఠకులు డిజిటల్కే అలవాటు పడిపోతారని, ప్రింట్ మీడియా కనుమరుగైపోయే ప్రమాదం ఉందని గ్రహించి – ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. పత్రికలపై శానిటైజర్ చల్లి ఏదో మానేజ్ చేశారు.
కానీ ఇప్పుడు పరిస్థితి విషమిస్తోంది. ఈమధ్య కాలంలో సర్క్యులేషన్ ఎంతెంత తగ్గింది? ఏయే ప్రాంతాలో పాఠకులు తగ్గారు. అపార్టుమెంట్లలో పేపర్ వేసినా, తీసుకోని శాతం ఎంత మంది? డిజిటల్ లో ఏ శాతంలో చదువుతున్నారు? అనే విషయమై యాజమాన్యాలు కసరత్తు చేయడం మొదలెట్టాయి. ఈ విషయమై లోపాయికారిగా సర్వే కూడా మొదలెట్టాయి. త్వరలోనే ఓ ప్రధాన పత్రిక కేవలం డిజిటల్ పార్మెట్ కి మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిజిటల్ వల్ల ఖర్చు తగ్గి, తక్కువ మంది ఉద్యోగులతో నెట్టుకు రావొచ్చని తేలితే… సదరు పత్రిక కేవలం డిజిటల్ రూపంలోనే దర్శనమివ్వాలని డిసైడ్ అయిపోయింది. మరో పత్రిక మాత్రం కొన్ని రోజుల పాటు ప్రింటింగ్ ఆపే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తర్జన భర్జనలు పడుతోంది. దీన్ని బట్టి.. ప్రింట్ మీడియా లో ఓ కీలకమైన మార్పుని త్వరలో చూడబోతున్నామన్న విషయం అర్థమవుతోంది.