బాహుబలి తరవాత… తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగింది. ఆ తరవాత చాలా సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు. తమ సినిమాకి ఆ స్థాయి, సత్తా ఉన్నా లేకున్నా – ‘మనమూ ట్రై చేస్తే తప్పేంటి?’ అని ధైర్యంగా ఓ అడుగు ముందుకేశారు. కొంతమంది ఎదురు దెబ్బలు తింటే, ఇంకొంతమంది అనుకోని లాభాలు చవి చూశారు. మొత్తానికి సినిమాకి పాన్ ఇండియా కోటింగు ఇవ్వడానికి బడ్జెట్లు పెంచుకున్నారు. స్టార్లని తీసుకొచ్చారు. ‘భారీ’ కలరింగు ఇవ్వడం మొదలెట్టారు. యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా జెండా ఎగరేయడం మొదలేట్టారు.
అయితే.. ఇప్పుడు వాటన్నింటికీ కరోనా సడన్ బ్రేకు వేసింది. కరోనా ప్రభావం ప్రపంచంపై ఎప్పుడు, ఎంత తగ్గినా – చిత్రసీమపై కొన్నాళ్ల పాటు అలానే ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటే కరోనా కొట్టబోతున్న దెబ్బ అలాంటిది. థియేటర్ నుంచి వచ్చే రెవిన్యూపై కరోనా భారీ స్థాయిలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కేవలం ఓటీటీనో, డిజిటల్ మీడియానో నమ్ముకుని సినిమాలు తీయలేరు ఎవరూ. ముఖ్యంగా పెద్ద సినిమాలకు, పాన్ ఇండియా సినిమాలకు థియేటర్ రెవిన్యూ అతి ముఖ్యమైన అంశం. అది తగ్గితే బడ్జెట్లు తగ్గించుకోవాలి. భారీ హంగులు తగ్గించుకోవాలి. పాన్ ఇండియా అనే ఆశలు తగ్గించుకోవాలి.
ఈ విషయమై ఓ ప్రముఖ నిర్మాత తెలుగు 360తో మాట్లాడుతూ ”సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. థియేటర్ల రెవిన్యూ తగ్గడం గ్యారెంటీ. అది ఏ స్థాయిలో అన్నది ఇప్పుడే అంచనా వేయలేం. థియేటర్ రెవిన్యూనే సినిమాకి ఆధారం. డిజిటల్ రైట్స్ అన్నీ.. అదనపు రాబడి మార్గాలే. పెద్ద సినిమాలకు ప్రమాదం పొంచి ఉంది, ఇప్పుడే బడ్జెట్లు కోత విధించుకోవడం ఉత్తమ మైన మార్గం” అని సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు కాస్ట్ కటింగ్ విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాయి. అనవసరమైన హంగుల్ని పక్కన పెట్టి, కథకు ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టాలన్న నిర్ణయానికి కొంతమంది నిర్మాతలూ వచ్చారు. పరిస్థితులు మళ్లీ యధాస్థితికి వచ్చేంత వరకూ పాన్ ఇండియా గురించి ఆలోచించకపోవడం, భారీ బడ్జెట్ చిత్రాలకు దూరంగా ఉండడమే మంచిది.