చైనాలో వెయ్యి పడకల ఆస్పత్రిని హుటాహుటిన నిర్మించినట్లుగానే.. తెలంగాణ ప్రభుత్వం 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేసింది. ఇరవయ్యో తేదీ నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన వారిని అందులో చేరుస్తారు. చైనా నిర్మించినట్లుగా ప్రత్యేకంగా భవనాన్ని తెలంగాణ సర్కార్ నిర్మించలేదు కానీ.. అప్పటికే ఉన్న భవనంలో ఆస్పత్రి తరహా సౌకర్యాలన్నింటినీ కల్పించింది. శరవేగంగా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా.. కరోనా పాజిటివ్ కేసులు పెరిగినా… ఇబ్బంది లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న పెద్ద భవనాన్ని స్వాధీనంం చేసుకుంది. శరవేగంగా ఆస్పత్రి ఏర్పాట్లు చేసింది.
కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో అన్ని రకాల మెడికల్ ఎక్విప్ మెంట్స్‌ను సమకూర్చింది. పెద్ద ఎత్తున వెంటిలేటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ నెల ఇరవయ్యో తేదీ నుంచి… కోవిడ్ రోగులను.. గచ్చిబౌలి ఆస్పత్రిలో చేర్చి.. చికిత్స ప్రారంభించే అవకాశం ఉంది. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే రోగుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అక్కడ నాలుగు వందలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజుకు…యాభై కి తక్కువ కాకుండా.. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలో.. గచ్చిబౌలిలోని కోవిడ్ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే.. చాలా పెద్ద రిలీఫ్ వచ్చినట్లుగానే భావించొచ్చు.
కోవిడ్ ఆస్పత్రిలో.. పూర్తి స్థాయి వైరస్ నిరోధక జాగ్రత్తలు తీసుకున్నారు. పీపీఈలు కావాల్సినన్ని అందుబాటులో ఉంచారు. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. గురువారం మరో 50 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తం వాటి సంఖ్య 700కి చేరింది. కాంటాక్ట్ కేసులే అత్యధికం ఉంటున్నాయని.. సామాజిక వ్యాప్తి లేదని ప్రభుత్వం చెబుతోంది. కొన్ని కొన్ని కేసుల్లో… వైరస్ ఎలా సోకిందో అంతుపట్టకపోయినా… సామాజిక వ్యాప్తిగా చెప్పలేమంటున్నారు.