ఇరవయ్యో తేదీ నుంచి లాక్డౌన్ నిబంధనలు సడలించాలనుకున్న కేంద్రం… హాట్ స్పాట్లులో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం పదమూడు జిల్లాల్లో పదకొండు జిల్లాలను హాట్ స్పాట్లుగా గుర్తించింది. ఓ రాష్ట్రంలో దాదాపుగా 80 శాతం భాగం హాట్ స్పాట్ గా ఉన్న రాష్ట్రం ఏపీనే. ప్రధానమంత్రికి జగన్ ఇచ్చిన ప్రజెంటేషన్ .. ఆ తర్వాత కేంద్రం ప్రకటించిన హాట్ స్పాట్ల లిస్టును పరిశీలిస్తే.. కేంద్ర ప్రభుత్వం.. జగన్ సర్కార్ ఇచ్చిన వివరాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది.
రెండు అంటే రెండు జిల్లాలను రెడ్జోన్లుగా చూపిస్తూ.. పదకొండో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 20కిపైగా కేసులు నమోదయ్యాయని ఈ రెండు జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లో చూపించారు. అప్పటికే లాక్‌డౌన్‌ను.. రెడ్ జోన్లకు పరిమితం చేస్తారన్న ప్రచారం జరగడంతో.. సీఎం జగన్.. మండలాల వారీగా రెడ్ జోన్లను ప్రకటించారు. ఏపీలో 676 మండలాలకుగాను 37 మండలాలు రెడ్ జోన్లో ఉన్నాయన్నారు. 44 ఆరెంజ్ జోన్లో ఉన్నాయని… 595 మండలాల్లో కరోనా ప్రభావం లేదని తెలిపారు. నిజానికి, కరోనా తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్రం జిల్లాను యూనిట్‌గా తీసుకుంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం కరోనా విషయంలో మొదటి నుంచి “ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్” అన్న పద్దతిలోనే ఉంది. అందుకే.. అదేమంత పెద్ద విషయం కాదన్నట్లుగా తీవ్రత తగ్గించి.. రాజకీయంగా తమ నిర్ణయాలను అమలు చేయడానికి అవసరమైన గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకుంటోందని భావిస్తున్నారు. ఎన్నికల్లాంటివి జరిగితే.. కరోనా వ్యాప్తిని అరికట్టడం.. అంత తేలిక కాదు. పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్ని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం… పదకొండు జిల్లాను హాట్ స్పాట్లుగా ప్రకటించిందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. 20వ తేదీ నుంచి కేంద్రం.. హాట్ స్పాట్లు కాని జిల్లాలకు సడలింపులు ఇచ్చింది. ఇప్పుడు ఏపీలో పదకొండు జిల్లాల్లోనూ లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది