ప్రపంచానికి ప్రస్తుతం కష్టాలన్నీ గ్రహస్థితుల కారణంగానేనని స్వరూపానంద స్వామి తేల్చేశారు. ప్రపంచాన్ని కాలసర్పదోషం వెంటాడుతోందని గుర్తించారు. గ్రహ పరిస్థితుల కారణంగానే కరోనా కంట్రోల్ కావడం లేదని..ఈనెల 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందని ప్రకటించారు. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని తనకున్న అపార పరిజ్ఞానంతో జోస్యం చెప్పారు. కరోనా ప్రమాదమే అయినా దేవుడి కృపతో ప్రభావం తగ్గుతుందని తనను నమ్మే భక్తులకు భరోసా ఇచ్చారు. జోతిష్య శాస్త్ర ప్రకారం కరోనా ఏళ్ల తరబడి ఉండదని … కరోనా కారణంగా దేశానికి అంతగా చేటు జరగదని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం దేశం అల్లకల్లోలం అవుతోంది. ఆర్థిక పరిస్థితి కుంగిపోతోంది. దేశానికి పది లక్షల కోట్ల నష్టం వచ్చిందని విశ్లేషణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలాంటి సమయంలోనూ.. స్వరూపానంద దేశానికి పెద్ద నష్టం జరగడం లేదని చెబుతున్నారు. పెద్ద నష్టం అంటే.. స్వామి ఏమనుకుంటున్నారో కానీ.. గ్రహస్థితుల కారణంగానే కరోనా కంట్రోల్ కావడం లేదన్న.. స్వామి అందుకోసం.. ఏమైనా యజ్ఞాలు, యాగాలు చేస్తారేమో ప్రకటించలేదు. తన యజ్ఞాలు, యాగాల వల్ల తెలంగాణలో కేసీఆర్.. ఏపీలో జగన్ ముఖ్యమంత్రులు అయ్యారంటూ.. ఆయన చెప్పుకుంటూ ఉంటారు.
అదే నిజమైతే.. కరోనా వైరస్ ను ఆపేందుకు ఎందుకు యజ్ఞాలు చేయడం లేదని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభం కావడంతో.. ఆయన తనదైన వాదనతోతెరపైకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. లాక్ డౌన్ ముగిసిపోయిన తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పుకొచ్చారు. గతంలో ఆయన చెప్పింది నిజం కాలేదు. కరోనా విజృంభిస్తోంది.. అందుకే మరోసారి ఆయన తెరపైకి వచ్చారు. ఈ సారి గ్రహస్థితులు అనుకూలించి.. ఆయనచెప్పినట్లుగా జరుగుతుందో లేదో మరి..!