లాక్డౌన్ నిబంధన పెద్దల చేతుల్లో అపహాస్యం పాలవుతోంది. కర్ణాటకలో… మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు… మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లిని.. ఫామ్‌హౌస్‌లో ధూమ్థామ్గా చేశారు. అరవై మంది అతిధులతో పెళ్లి నిర్వహించాడనికి అక్కడి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. కానీ అక్కడ మూడువందల మందికిపైగా హాజరయ్యారు. ఒక్కరూ సోషల్ డిస్టాన్సింగ్ పాటించలేదు. మాస్కులు కూడా పెట్టుకోలేదు. ఆ పెళ్లిపై దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. పేదలకు మాత్రం కఠిన నిబంధనలు అమలు చేస్తూ పలుకుబడి ఉన్న వాళ్లు ఇలా చేయడం ఏమిటని ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఏపీలోనూ అంతకు భిన్నంగా ఏమీ జరగడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అలవి మాలిన అధికారాన్ని అనుభవిస్తూ షాడో సీఎంగా టీడీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి… విశాఖలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ” పవర్ ” చాలా మందిని ఆ రక్తదాన శిబిరానికి వచ్చేలా చేసింది. అక్కడెవరూ సోషల్ డిస్టాన్సింగ్ పాటించలేదు.
విజయసాయిరెడ్డి నేతృత్వంలో ప్రగతి భారత్ అనే ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి… పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ట్రస్ట్ పేరు మీదే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే ఇలా ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఉల్లంఘించడం ఏమిటన్న చర్చ జోరుగా నడుస్తోంది. నిజానికి విజయసాయిరెడ్డి… రాష్ట్రంలో అత్యంత స్వేచ్చ ఉన్న వ్యక్తి. ఆయన సిక్కోలు నుంచి చిత్తూరు వరకు… కాన్వాయ్‌తో అలా వెళ్లిపోగలరు. ఎవరూ అడ్డుకోవడం లేదు. టీడీపీ నేతలు.. ఇదేం పద్దతని విమర్శలు చేసినా ఆయన డోంట్ కేర్. ఇలాంటి ఉల్లంఘనలు చూసినప్పుడే సామాన్యులు తాము మాత్రం.. ఎందుకు అలా చేయకూడదని.. మోటివేట్ అవుతూంటారు. ఆదర్శంగా ఉండాల్సిన వారే ఉల్లంఘిస్తూ ఉంటే.. సామాన్యులు మాత్రం ఊరుకుంటారా..?