ప్రస్తుతానికి తన చేతిలో ఉన్న ఐటీ మరియు పంచాయతీయ రాజ్ శాఖలకు తోడు కొత్తగా పట్టణాభివృద్ధి శాఖను కూడా చేపట్టిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, బుధవారం నాడు సాయంత్రం తొలిసారిగా ఆ శాఖకు సంబంధించిన అధికారులు, గ్రేటర్‌కు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో తమ పార్టీ తరఫున ఇచ్చిన హామీలు అన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తాం అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏ నాయకుడు అయినా ఇలాగే చెప్తారు గానీ.. హామీలు నెరవేర్చే విషయంలో కేటీఆర్ ప్రకటించిన తీరు కూడా, సవాలు విసురుతున్నట్లుగానే ఒక సాహసంలాగా ఉండడం విశేషం. జీహెచ్‌ఎంసీ పరిధిలో తమ ప్రభుత్వం ఏం చేయబోతున్నది అనే విషయాలను ఒక ఎజెండాలాగా ప్రకటించి.. ఆ మేరకు పనులు చేపడుతాం అంటూ కేటీఆర్ ప్రకటించారు. నిజానికి ఇలా చెప్పడం సాహసంగానే అభివర్ణించాలి.
ఎందుకంటే.. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం వేరు. ఎన్నికల తర్వాత.. హామీలను ఎజెండా రూపంలో ప్రకటించి పంచుతాం అనడం వేరు. ఎజెండాలాగా హామీలను బహిరంగంగా ప్రకటిస్తే గనుక.. గడువుల వారీగా ప్రజలు ప్రభుత్వాన్ని వెంటపడుతూ ఉండే ప్రమాదం ఉంటుంది.
నిజానికి మనదేశంలో మేనిఫెస్టోలకు ఎన్నికల తర్వాత విలువ ఉంటుందనే విషయాన్ని ప్రజలు మర్చిపోయారు. మేనిఫెస్టోలో చెప్పిన పాయింట్లు పట్టుకుని ప్రభుత్వాల్ని నిలదీసే ధోరణులు మన వారి వద్ద లేవు. ఇలాంటి నేపథ్యంలో.. గెలిచిన తర్వాత.. విజన్ డాక్యుమెంట్ లాగా చేయబోయే పనుల ఎజెండాను ప్రకటిస్తానని కేటీఆర్ చెప్పడం సాహసమే అనాలి. అలా ఆయన ముందుగానే ప్రకటించి.. ఆ మేరకు పనులు చేసి, ప్రజల ఆదరణను చూరగొనగలిగితే గనుక.. వారిని సెభాష్ అనాల్సిందే.
ఈ విషయంతో పాటూ మునిసిపల్ శాఖకు సంబంధించి ఇంకా పలువిషయాలను కేటీఆర్ ప్రకటించారు. అన్ని శాఖలపై ఇంకా అవగాహన పెంచుకోవాల్సి ఉన్నదని, పలు సమీక్ష సమావేశాలు పెట్టుకోవాల్సి ఉన్నదని చెప్పారు. పన్నుల వసూళ్లు పెరగాలని, తాను మంత్రి అయ్యాక పంచాయతీల్లో పన్నుల వసూళ్లు 36 నుంచి 70 శాతానికి పెంచామని, పట్టణాల్లో కూడా అలా పెంచాలని కేటీఆర్ అన్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని కూడా ఆయన నిబంధనలు ఉల్లంఘించే వారిని హెచ్చరించారు.