హాట్స్పాట్లు కాని ప్రాంతాల్లో ఈ నెల ఇరవయ్యో తేదీ నుంచి కొన్ని సడలింపులను ఇస్తూ.. కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే.. వాటిని అమలు చేయాలా వద్దా అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ సర్కార్…ఈ విషయంలో తీవ్రమైన చర్చలు జరపుతోంది. కరోనా కేసులు ఏ మాత్రం కంట్రోల్ కాలేదని.. రోజుకు యాభై నుంచి అరవై పాజిటివ్ కేసులు బయటపడుతున్నందున… సడలింపులు ఇస్తే.. పరిస్థితి మరింత చేయి దాటుతుందన్న ఆందోళనలో ఉంది. అందుకే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి..మంత్రులతో ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు.
నియంత్రణకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇప్పటికే సడలింపులు ఇచ్చింది. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో.. ఇతర రంగాలకు పర్మిషన్లు ఇస్తే.. కొత్త చిక్కులు వస్తాయని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సడలింపులపై ప్రచారం కారణంగా జనసంచారం పెరుగుతోందని, ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కఠినంగా ఉండాలన్న అభిప్రాయం.. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. అందరూ.. ఎలాంటి సడలింపులు ఇవ్వకపోతేనే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఆదివారం రోజు.. తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ సమావేశంలోనే.. సడలింపులు ఇవ్వకూడదని.. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ మినహాయింపులు గ్రీన్ జోన్ జిల్లాలకు కూడా వర్తించకుండా.. పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది.