ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణ కొరియా నుంచి ఓ ప్రత్యేక విమానం వచ్చింది. అందులో వైరస్ ర్యాపిడ్ టెస్టుల కిట్లు వచ్చాయి. అయితే.. అదే దక్షిణ కొరియా నుంచి.. ప్రభుత్వం సంతోషపడే మరో వార్త కూడా.. వచ్చింది. అదేమిటంటే.. ఇంత కరోనా కలకలంలోనూ అక్కడ ఎన్నికలు జరిగాయి. పెద్ద ఎత్తున జనం ఓట్లేశారు. స్థానిక ఎన్నికలు ఆగిపోయాయని బాధపడుతున్న ప్రభుత్వం.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్వహించాలనుకుంటోంది. దానికో ప్రాతిపదిక కావాలి కాబట్టి… అది దక్షిణ కొరియా నుంచి దొరికినట్లయింది. సీఎంతో శుక్రవారం జరిగిన ఓ ఉన్నత స్థాయి సమీక్షలో… మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు… ఎన్నికలు నిర్వహించిన ఫోటోలు చూపించినట్లు…ఓ ఇంగ్లిష్ దినపత్రిక ప్రచురించింది. ముఖ్యమంత్రి జగన్ కూడా.. విజయ్ కుమార్ చెప్పిన విషయాలను సీరియస్‌గా అలకించినట్లుగా చెప్పింది.
దక్షిణ కొరియాలో జాతీయ అసెంబ్లీకి మూడు రోజులక్రితం ఎన్నికలు నిర్వహించారు. కరోనా ప్రభావం అక్కడ కూడా తీవ్రంగా ఉంది. అయితే.. అక్కడి ప్రభుత్వం ప్రభావవంతంగా నిలుపుదల చేసింది. టెక్నికల్‌గా… గొప్ప స్థితిలో ఉన్న దక్షిణ కొరియా.. అమెరికాకు కూడా.. కరోనాపై పోరాటానికి అవసరమైన సాంకేతిక సాయం అందిస్తోంది. అయినప్పటికీ.. ఓటర్ల పరంగా.. చాలా జాగ్రత్తలు తీసుకుంది. మాస్క్‌లు, ప్లాస్టిక్ గ్లౌజ్‌లు ధరించి.. అక్కడి ప్రజలు ఓట్లు వేశారు. పోలింగ్ బూత్‌కు వచ్చిన వారికి మొదట టెంపరేచర్ చెక్ చేశారు. 37.5 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటినవారికి ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద సోషల్ డిస్టాన్సింగ్ పాటించేలా చర్యలు తీసుకున్నారు.
ఇవన్నీ ఏపీ సర్కార్ ను బాగా ఆకర్షించినట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికలను కూడా… ఆ పద్దతిలో నిర్వహించవచ్చనే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్దేశంతోనే ఇప్పటికే.. ఎస్ఈసీని ప్రభుత్వం మార్చింది. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్.. వచ్చే నెల మూడో తేదీ తర్వాత ముగుస్తుంది. ఆ తర్వాత.. ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకుని సవరించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందని వైసీపీవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల విషయంలో ప్రభుత్వ పట్టుదలను చూస్తే.. దీన్ని కాదనలేని పరిస్థితులు ఉన్నాయని వైసీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.