ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసం సమీపంలోని ఓ మహిళ కరోనా కారణంగా మృతి చెందింది. తాడేపల్లి పాత టోల్గేట్ వద్ద ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న మహిళ అనారోగ్యంతో విజయవాడ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులు వైరస్ టెస్టు చేయించారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మహిళ ఉంటున్న అపార్ట్మెంట్ సమీపంలోనే సీఎం జగన్ నివాసం ఉంటుంది. మూడు రోజుల క్రితం.. తాడేపల్లిలోని ఓ వ్యక్తికి కరోనా సోకడంతో.. సీఎం జగన్ నివాసం బఫర్ జోన్ లోకి వచ్చింది.
మంగళగిరి కమర్షియల్ టాక్సెస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తాడేపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. అపార్ట్మెంట్కి చుట్టుపక్కల ఓ కిలోమీటర్ వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం, చుట్టుప్రక్కల గ్రామాలను మూడు జోన్లుగా విభజించారు. మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఏడు కిలో మీటర్ల పరిధిని బఫర్ జోన్ గా ప్రకటించారు. ఇప్పుడు సీఎం జగన్ నివాసముంటున్న ప్రాంతం కూడా బఫర్ జోన్లోకి వచ్చింది. అయితే.. ఇప్పుడు… కొత్తగా కరోనాతో మృతి చెందిన మహిళ ఉంటున్న అపార్టుమెంట్…జగన్ నివాసం ఉంటున్న నివాసానికి కిలోమీటర్ మాత్రమే ఉంటుంది.
నిబంధనల ప్రకారం.. మూడు కిలోమీటర్ల వరకూ రెడ్ జోన్ గా ప్రకటించాలి కాబట్టి సీఎం జగన్ నివాసం రెడ్ జోన్ లోకి వచ్చింది. సాధారణంగా నిబంధనల ప్రకారం.. రెడ్ జోన్ లోకి రాకపోకలు నిషేధం. ఇప్పుడు సీఎం ఇంట్లోకి రాకపోకలు నిషేధించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిస్థితి లేకుండా..గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కొత్త ప్రకటన చేశారు. తాడేపల్లిలోని సీఎం నివాసం రెడ్ జోన్లో లేదని 4 పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతం రెడ్‌జోన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించారు.