విజయవాడలో వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమయింది. ఇదే విషయాన్ని అధికారులు నిర్మోహమాటంగా ప్రకటించింది..ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. భయపెట్టడానికి ఇలా చెప్పడం లేదని.. బెజవాడలో కరోనా పరిస్థితి భయంకరంగా ఉందని.. అంటున్నారు. గత వారం నాలుగైదు రోజుల పాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా కృష్ణా జిల్లాలో నమోదు కాలేదు. హఠాత్తుగా.. ఇప్పుడు… ఒక్క రోజే 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 17 విజయవాడ టౌన్లోనివే. కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70. వీటిలో 58కేసులకు పైగా ఒక్క విజయవాడ నగరంలోనే నమోదు అయ్యాయి. మొదట్లో మర్కజ్ లింకులు.. విదేశాల నుంచివచ్చిన వారి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందిందని అనుకున్నారు.
కానీ.. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో అసలు కాంటాక్ట్‌లు కూడా కాకపోవడం పోలీసుల్ని, కలెక్టర్‌ను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. 30 మందికి ట్రావెల్ హిస్టరీ లేదు.. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్ని కలిసిన సందర్భం కూడా లేదు. అయినా వారికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు నేరుగానే చెబుతున్నారు. అత్యవసర పనులు మినహా ఎవరూ బయటికి రావద్దని… ఒక వేళ పాటించకపోతే.. కరోనా మహమ్మారిని ఆపడం ఎవరివల్లా కాదంటున్నారు. ఎవరికో ఒక ఐదుగురికి వచ్చిందని, తమకు రాదనే భావనతో ఉండకూడదని పోలీసులు అంటున్నారు. విజయవాడలో పరిస్థితి మొదటి నుంచి తేడాగానే ఉంది.
టెస్టుల విషయం… పరీక్షల విషయలో… పారదర్శకత లేకపోవడం… వైసీసీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా రెడ్ జోన్లలో కూడా.. తిరిగి రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం కామన్ గా మారిపోయింది. దీంతో ప్రజలు కూడా..లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా.. పరిస్థితులు అదుపుతప్పే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సామాజిక వ్యాప్తి దశకు చేరిందని పోలీసులే చెబుతూండటంతో.. పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లో నూ కనిపిస్తోంది.