‘శివ’ షూటింగ్ జరుగుతున్న రోజులు. ఓ కేఫ్‌లో ఫైట్ తీయాలి. పఠాన్ చెరువు పరిసరాల్లో ఉన్న కేఫ్‌లో షూటింగ్‌కి ప్లాన్ చేశారు. కేఫ్‌లో షూటింగ్ జరుగుతుందని తెలిసి.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా వచ్చారు. మధ్యాహ్నం రెండున్నరకు షాట్ ఫిక్స్ చేశాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆ సినిమాతో జేడీ చక్రవర్తి తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు. నాగార్జున కాంబినేషన్లో జేడీకి అదే తొలి సీన్. అప్పుడే మధ్యాహ్నం భోజనం ముగించుకుని నాగార్జున కేఫ్‌లోకి అడుగుపెడుతుంటే, కేఫ్‌లో ఉన్న జేడీ బయటకు వెళ్తున్నాడు. అనుకోకుండా.. ఇద్దరూ ఢీ కొట్టుకున్నారు.
“ఏంటి.. కళ్లు కనపడడం లేదా.. చూసుకుని వెళ్లొచ్చు కదా…” నాగార్జున సీరియస్.
“చూళ్లేదు.. అందుకే గుద్దాను.. చూసుంటే గుద్దను కదా” ఇదీ జేడీ ఎదురు సమాధానం. దాంతో నాగార్జునకు చిర్రెత్తుకొచ్చింది.
“ఏం మాట్లాడుతున్నావో.. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా” అంటూ జేడీ మీదకు వెళ్లబోయాడు.
“మీరే అనవసరంగా మాట్లాడుతున్నారు..” అంటూ జేడీ కూడా రెచ్చిపోయాడు.
దాంతో నాగ్‌కి కోపం వచ్చి ఒక్క గుద్దు గుద్దితే… జేడీ అంత దూరం పడ్డాడు. చూట్టూ ఇంతమంది జనాలమధ్య నాపై చేయి చేసుకుంటాడా, అనే కోపం తో నాగ్ కాలర్ పట్టుకున్నాడు జేడీ.
ఏం జరుగుతుందో తెలిసేసరికే ఇద్దరూ కలబడ్డం మొదలెట్టారు. నాగార్జున సహాయకులు, అన్నపూర్ణ స్డూడియో సిబ్బంది రాడ్లు పట్టుకుని నాగ్‌కి రక్షణ వలయంగా నిలబడ్డారు. జేడీపై దాడి చేయడానికి సిద్ధపడ్డారు. ఇక్కడేదో జరుగుతుందని భయపడిన జనం.. అక్కడి నుంచి పారిపోయారు.
నాగ్ అనుచరులు జేడీ మీదకు ఎగబడుతన్న సమయంలో… “ఆపండి.. ప్లీజ్.. జేడీని ఏం చేయొద్దు..” అంటూ తనవాళ్లకీ జేడీకీ అడ్డుగోడలా నిలబడ్డాడు నాగ్.
చుట్టుపక్కల వాళ్లకు ఇదంతా అర్థం కాలేదు. “ఇదంతా షూటింగ్..” అంటూ కెమెరాని చూపించాడు నాగార్జున. ఇదంతా షూటింగ్లో భాగమని అప్పుడు అర్థమైంది మిగిలిన వాళ్లకు.
జనం గుంపులు గుంపులుగా రావడంతో, వాళ్లని బెదరగొట్టడానికి వర్మ వేసిన స్కెచ్ ఇది. `రియల్ ఫైట్లా ఉండాలి. దాన్ని ఎవరికీ తెలియకుండా షూట్ చేస్తాను. మీరెంతలా భయపెట్టాలంటే షూటింగ్ చూడ్డానికి వచ్చినవాళ్లు కూడా పారిపోవాలి` అంటూ అప్పటికప్పుడు స్క్రిప్టు అల్లి నాగ్‌కీ, జేడీని అలా వదిలేశాడు వర్మ. అందుకే ఇద్దరూ పాత్రలో జీవించి, నిజంగా కొట్టేసుకునేవరకూ వెళ్లారు. అదీ అసలు సంగతి. వర్మ స్కెచ్చులు వేయడం తొలి సినిమాతోనే నేర్చేసుకున్నాడన్నమాట.