ఆంధ్రప్రదేశ్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ.. సడలింపులు ఎక్కువగా ఇవ్వడానికే ప్రభుత్వం నిర్ణయించుకుంది. జిల్లాల వారీగా కాకుండా.. మండలాల వారీగా.. రెడ్ జోన్లు అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు.. వైరస్ బయటపడిన 97 మండలాలను ఐడెంటిపై చేసి.. ప్రకటన చేసింది. వాటిలో మాత్రం… సడలింపులు ఉండవని.. మిగతా రాష్ట్రం మొత్తం కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. సడలింపులు ఉంటాయని తెలిపింది. నిజానికి ఇప్పుడు 97 మండలాలు అని ప్రభుత్వం ప్రకటించింది కానీ.. కేంద్రానికి పంపిన రిపోర్టులో కేవలం 37మండలాలు మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 676 మండలాలు ఉంటే.. అందుకే.. కేవలం.. 37 మండలాలు మాత్రమే.. వైరస్ సోకి.. రెడ్ జోన్లో ఉన్నాయని అక్కడ మాత్రం లాక్ డౌన్ ఉంటే చాలని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానికి జగన్ వివరించారు. వారం రోజుల్లోనే ఆ సంఖ్య 97కు చేరింది.
నిజానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన హాట్ స్పాట్ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్వే 11 ఉన్నాయి. దీంతో… లాక్ డౌన్ నిబందనలు సడలించినా.. ఏపీలో సాధ్యం కాదని అనుకున్నారు. కానీ రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో.. ప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది. అదే సమయంలో.. ప్రజల ఉపాధి కూడా దెబ్బతిన్నది. గాడిలో పెట్టాలంటే.. పరిమితంగా అయినా కార్యకలాపాలు ప్రారంభించాలన్న పట్టుదలతో ఏపీ సర్కార్ ఉంది. దీంతో రెడ్ జోన్లలో కఠినమైన చర్యలు తీసుకుని మిగిలిన మండలాల్లో యధావిధిగా కార్యకలాపాలు అనుమతించాలని నిర్ణయించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. మినహాయింపులు ఏ ఏ రంగాలకు వర్తిస్తాయో వివరిస్తూ.. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
అయితే… ఏపీలో వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. విజయవాడ లాంటి చోట్ల సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. మండలాలకే పరిమితం చేసి.. మిగిలిన చోట్ల కార్యకలాపాలు ప్రారంభిస్తే.. పరిస్థితి చేయి దాటుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల్లోనే ప్రపంచం మొత్తం చుట్టేసిన వైరస్… ఓ రాష్ట్రంలో విస్తరించడానికి పెద్ద సమయం పట్టదన్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం.. మినహాయింపులు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తోంది.