యవ్వనంలో ప్రేమన్నది పిలవకపోయినా వచ్చే అతిథి లాంటిది. ప్రతి ఒక్కరికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. అది ఫలించినా, ఫలించకపోయినా – ప్రేమ దాటి మరో అడుగు వేయకపోయినా, జీవితాంతం ఆ ప్రేమ గుర్తుంటుంది. విఫల ప్రేమకథ అయితే ఆ తీయని బాధ.. ఎప్పటికీ మనసుని తొలిచేస్తూనే ఉంటుంది. రజనీకాంత్‌కీ ఓ ప్రేమకథ ఉంది. ఆ ప్రేమని, ఆ ప్రియురాల్నీ, ఆ కథనీ రజనీ ఎప్పటికీ మర్చిపోడు.
రజనీకాంత్ కండెక్టర్‌గా పనిచేస్తున్న రోజులవి. నిర్మల అనే వైద్య విద్యార్థిని రజనీకాంత్ పనిచేసే బస్సులోనే రోజూ ప్రయాణం చేసేదట. అలా చూపులు కలిశాయి. ఆ తరవాత మాటలు మొదలయ్యాయి. అప్పట్లో రజనీ నాటకాలు వేసేవాడు. ఓ నాటకానికి ఆమెను ఆహ్వానించాడట. కొన్నాళ్లకు మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి రజనీకాంత్ కి ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. నిజానికి రజనీ అప్లై చేయలేదు. మరి ఈ ఇంటర్వ్యూ లెటర్ ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యపోతుంటే నిర్మల గుర్తొచ్చింది. ఆ రోజు నాటకంలో రజనీ నట విశ్వరూపాన్ని చూసిన నిర్మల… తనే దరఖాస్తు పూర్తి చేసి పంపింది. అయితేబెంగళూరు నుంచి మద్రాస్ వెళ్లడానికి రజనీ దగ్గర డబ్బుల్లేవు. అప్పుడు కూడా నిర్మలనే ఆర్థిక సహాయం చేసి… మద్రాస్ పంపించింది. మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన కొన్నాళ్లకు.. మళ్లీ రజనీ బెంగళూరు తిరిగి వచ్చాడు. నిర్మల చిరునామా వెదుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లాడు. కానీ అప్పటికి నిర్మల లేదు. తన కుటుంబంతో కలిసి మరో ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయిందట. అప్పటి నుంచీ.. రజనీ నిర్మలని మళ్లీ కలుసుకోలేదట. తనది ఓ విఫలమైన ప్రేమ గాథని, తన నటనా జీవితానికి ఓ రకంగా స్ఫూర్తి నింపింది ఆ అమ్మాయే అని రజనీ ఇప్పటికీ తన సన్నిహితులతో చెప్పుకుంటుంటాడు. ఈ లవ్ ఫెయిల్యూర్ స్టోరీని ప్రముఖ నటుడు దేవన్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. అదీ.. సూపర్ స్టార్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఆ నిర్మల ఇప్పుడు ఎక్కడ ఉందో.