ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. అసలు కిట్లలో గోల్ మాల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత.. అప్పటి వరకు చేసుకున్న సమర్థనలన్నింటినీ పక్కన పెట్టేసి.. ఆ కిట్లు అమ్మిన కంపెనీపై గుడ్లు ఉరుముతున్నట్లుగా ఓ లేఖ పంపారు. దాన్ని మీడియాకు విడుదల చేశారు. కానీ.. అసలు కిట్ల కొనుగోలు వ్యవహారంలో లొసుగులు బయటపడిన దగ్గర్నుంచి సమర్థించుకునేందుకు ప్రభుత్వం… ప్రభుత్వంలోని వ్యక్తులు పడిన తంటాలు చూస్తే.. “సమ్‌ధింగ్ ఫిషి” అని అనుమానంచడంలో ఎలాంటి తప్పు లేదని అనుకోవచ్చు.
చత్తీస్‌గఢ్ ట్వీట్‌తో ఏపీ కిట్ల కథ వెలుగులోకి..!
వైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు విశాఖ మెడ్టెక్జోన్తో తయారవుతున్నాయని.. దేశం మొత్తానికి ఏపీ నుంచి సప్లయ్ చేస్తామని.. ఓ ఫైన్ మాణింగ్ ఏపీ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కిట్లను స్వహస్తాలతో విడుదల చేశారు. యాభై నిమిషాల్లోనే టెస్ట్ రిజల్ట్ తెలుస్తుందని… గర్వంగా ప్రకటించారు. సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత పది రోజులకు… కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష వైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయని… ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా.. ముఖ్యమంత్రి స్వహస్తాలతో ప్రారంభోత్సవం చేసిన తానే ఓ టెస్ట్ చేసుకోవడంతోనే వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఎవరికీ .. ఆ లక్ష కిట్లు ఎంతకు కొన్నారు..? ఎప్పుడు టెండర్లు పిలిచారు..? ఎవరెవరు టెండర్లలో పాల్గొన్నారు..? అసలు ఆ టెస్టులతో వైరస్‌ను నిర్ధారించవచ్చా..? లాంటి అనుమానాలు రాలేదు. కానీ… ఎలాంటి బాగోతం అయినా.. ఎక్కడో ఓ చోట బయటపడక తప్పదన్నట్లుగా చత్తీస్ఘడ్ మంత్రి చేసిన ఓ ట్వీట్.. మొత్తం కథను కదిలించేసింది.
@PMOIndia @MoHFW_INDIA @republic @ANI
A Probe is needed in 100% Excessive Rate procurement in AP !
Chhattisgarh procured High Quality Rapid Testing Kits from South Korea at ₹337
Andhra Procured at ₹700 as per AP Govt ( 1 lakh kits )
Is there any HUGE scam involved ? pic.twitter.com/wqVvzc0ZSK
— Telugu360 (@Telugu360) April 18, 2020
ప్రభుత్వంపై విరుచుకుపడిన సోషల్ మీడియా..!
చత్తీస్ఘడ్ మంత్రి తాము కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఒక్కొక్క దానికి 337 రూపాయలకు కొనుగోలు చేశామని ట్విట్టర్లో గొప్పగా ప్రకటించుకున్నారు. ఆయన ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియదు కానీ.. ఆ ట్వీట్ మాత్రం ఏపీలో ఒక్క సారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే.. ఆ రూ. 337 కిట్లనే.. ఏపీ సర్కార్ కొనుగోలు చేసింది. అదీ కూడా.. రూ. 1200 పెట్టి అని.. సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇదో పెద్ద స్కాం అని … దీని వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఎందుకంటే.. ఇలా లక్ష కిట్లు వచ్చీ రాగానే… ప్రారంభోత్సవం చేసేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో పది లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చేయండి అని ఆర్డర్ ఇచ్చేశారు మరి. సీఎం మాటంటే.. శిలాశాసనం. ఈ పాటికి ఇచ్చే ఉంటారు. అది వేరే విషయం.. అసలు రూ. 337కి వచ్చే కిట్లకు.,. రూ. 1200 పెట్టి కొనడం ఏమిటన్న చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమయింది. ఇది అంతకంతకూ పెరిగిపోవడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
మొదట అడ్డగోలుగా సమర్థించుకున్న ప్రభుత్వం..!
మొదట ఇలా ప్రచారం చేసేవారిని ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేసింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను రూ. 1200కి కొనుగోలు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రూ. 700కి మాత్రమే కొన్నామని ప్రకటించింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఒక్కో కిట్ రూ. 640కే కొనుగోలు చేశామని మీడియాకు చెప్పారు. అయితే.. ఆ తర్వాత.. ఈ కిట్లను సరఫరా చేసిన సండూర్ మెడికెయిడ్స్ కంపెనీకి ఇచ్చిన ఆర్డర్ కాపీ వెలుగులోకి వచ్చింది. అందులో రూ. 730కి ఆర్డర్ ఇచ్చినట్లుగా ఉంది. అంటే.. ఎంతకు కొన్నారో ఉన్నతాధికారులకే క్లారిటీ లేదు. ఎలాగోలా కవర్ చేద్దామని తాపత్రయ పడ్డారు. ఆ తర్వాత కూడా.. కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్‌తోనూ వివరణ ఇప్పించారు.
గుట్టు బయటపడేసరికి.. చత్తీస్‌గఢ్ కొన్నది.. ఏపీ కొన్నది వేర్వేరనే వాదన..!
సోషల్ మీడియాలో రేట్ల మధ్య గ్యాప్ హైలెట్ అయిన తర్వాత వైసీపీ నేతలు ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని… పడికట్టు పదంతో ఎదురుదాడి ప్రారంభించారు. ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి.. చత్తీస్ ఘడ్ కొన్న కిట్లకు..ఏపీ కొన్న కిట్లకు.. తేడా ఉందని… చత్తీస్ ఘడ్ కొన్న కిట్ల రిజల్ట్ 30 నిమిషాల్లో వస్తుందని..అదే ఏపీ కొనుగోలు చేసిందయితే.. 10 నిమిషాల్లోనే వస్తుందని తేల్చారు. ఆ తర్వాత రాజీవ్ కృష్ణ అనే మరో సలహాదారు కూడా రంగంలోకి దిగారు. ఆయన కూడా.. ఇలాంటి వాదనే వినిపించారు. ఇక.. మోపిదేవి వంటి మంత్రులు దీన్ని చిల్లర రాజకీయంగా తేల్చేసి… చంద్రబాబును తిట్టడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అంతిమంగా వీరు చెప్పిందేమిటంటే… వాటికి రూ. 730 పెట్టడం కరెక్టేనని. అయితే.. కాసేపటికే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు.
– ఆ కిట్ వేరు , ఈ కిట్ వేరు
– మా ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ కంటే రెట్టింపు ధర కి కరోనా కిట్స్ కొనలేదు
– టర్మ్ అండ్ కండీషన్స్ వేరు
అని బుకాయించిన అధికార పార్టీ వారు ఇప్పుడు అయినా కళ్ళు తెరిచి ఈ నిజాన్ని చూసి తప్పు ను సరిదిద్దుకోండి
మీడియా , సోషల్ మీడియా యువత ? pic.twitter.com/HWj9soSc1X
— Telugu360 (@Telugu360) April 19, 2020
చివరికి తేలు కుట్టిన చందాన… సరఫరా చేసిన కంపెనీకి లేఖ..!
సమర్థించుకునే పరిస్థితి చేయిదాటిపోవడం.. స్కామ్ జరిగిందని.. పక్కాగా తేలిపోతూండటంతో.. ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. రాత్రికి రాత్రి.. వెంటనే… సండూర్ మెడికెయిడ్స్కు ఓ లేఖ రాసింది. పొరుగు రాష్ట్రం చత్తీస్‌ఘడ్‌కు రూ. 337కే అమ్మి.. మాకు రూ. 730కి అమ్ముతారా అని.. కన్నెర్ర చేసింది. ఇది కూడా.. కవరింగ్ ప్రక్రియ. నిజానికి.. సండూర్మెడికెయిడ్స్… చత్తీస్‌ఘడ్‌కు అమ్మలేదు. డైరక్ట్ గా.. కొరియా కంపెనీ నుంచే కొనుగోలు చేసింది. కానీ ఏపీ సర్కార్.. తాము నేరుగా కొరియా నుంచే కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది కానీ.. వాస్తవానికి సండూర్ మెడికెయిడ్స్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. వాళ్లు తెప్పించి ఇచ్చారు. అందుకే.. ప్రభుత్వం చెబుతున్న ధరల తగ్గింపు క్లాజ్.. సండూర్ మెడికెయిడ్స్కి వర్తించదు. ఆ విషయం తెలియనంత అమాయకులేం కాదు ప్రభుత్వంలోని వ్యక్తులు. అయితే.. ఇప్పటికిప్పుడు పరువు కాపాడుకోవడానికి ఓ పరిష్కార మార్గం ప్రభుత్వం దగ్గర ఉంది. సండూర్ మెడికెయిడ్స్ అనే ఈ కిట్ల కాంట్రాక్ట్ పొందిన కంపెనీలో… ఓ డైరక్టర్ కసిరాళ్ల వెంకట మురళీధర్ రెడ్డి. ఆయన కర్నూలుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి సోదరుడి బిజినెస్ పార్టనర్. లింక్ అక్కడ ఉండటంతో.. తప్పయిపోయిందని ఒప్పుకుని.. తాము రూ. 337కే కిట్లు ఇస్తామని అంగీకరించి.. ప్రభుత్వానికే విన్నింగ్ పాయింట్ ఇచ్చి.. బయటపడే ప్రయత్నం చేయవచ్చు. చివరికి క్లైమాక్స్ అదే జరగొచ్చు.
అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో తీర్చి తీరాల్సిన ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
1. అసలు విశాఖలో కిట్ల తయారీ ఉండగా కొరియా నుంచి ఎందుకు దిగుమతి చేసుకున్నారు..?
2. అసలు కిట్ల కోసం టెండర్లు ఎప్పుడు పిలిచారు..? ఏ ఏ కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి..?
3. ఏ యే కంపెనీలు ఎంత ఎంతకు ఇస్తామని ఆఫర్ చేశాయి..?
4. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం వేసిన టెండర్లలో నేరుగా కొరియా కంపెనీనే పాల్గొన్నది. ఏపీ టెండర్లలో పాల్గొనలేదా..?
5. అసలు ఈ టెండర్ ప్రక్రియ పత్రాలన్నీ ఎందుకు రహస్యంగా ఉంచారు..?
6. మొత్తం బయటపడిన తర్వాత ఎందుకు సమర్థించుకున్నారు..? ఎందుకు ఎందుకు ఎదురుదాడి చేశారు..? ఎందుకు కేసులు పెడతామని బెదిరించారు..?
7. కాంట్రాక్ట్ ప్రకారం.. సరుకు అందిన తర్వాత కూడా… ఇంకా ధరలు చర్చల్లో ఉన్నాయని చెప్పి నమ్మించే ప్రయత్నం ఎందుకు జరిగింది..?
8. అసలు ఈ డౌట్లన్నీ తీర్చకుండా.. ఓ లెటర్ కంపెనీకి రాసేసి.. ఇష్యూ ముగిసిందని ఎందుకు తొందరపడుతున్నారు..? అసలు గూడు పుఠాణి బయటకు రాకూడదా..?
నీతులు చెప్పిన పారదర్శకత ఏది..?
పారదర్శకతే మా విధానం అని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటారు. కానీ కిట్ల కొనుగోలుకు సంబంధిచంిన టెండర్లను.. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ ఏపీ సర్కార్.. అలాంటి పని చేయడం లేదు. ఆ మాత్రం పారదర్శకత పాటించడానికి కూడా… మనసు ఒప్పడం లేదా..? రూపాయి కాంట్రాక్ట్ అయినా జ్యూడిషియల్ రివ్యూ చేస్తామన్న ప్రకటనలన్నీ ప్రగల్భాలేనా..? ఇప్పుడు రూ. 34 కోట్ల ప్రజాధనం కొట్టేయడానికి ప్లాన్లు వేసిన వారిపై ఏ చర్యలు తీసుకుంటారు..?