పూరి ఎప్పుడు చూసినా ఏదో ఓ కిక్‌లో ఉంటాడు.
సినిమానో
పుస్తకమో
ఎవరిదో జీవితమో ఇచ్చిన కిక్ కాదని.
తనకు తాను ఇచ్చుకున్న కిక్.
‘ఇసురోమని మనుషులుంటే దేశం ఏం బాగుపడుతుందని’ అనుకుంటాడో ఏమో.. నిలువెల్లా ఎనర్జీని నింపుకుంటాడు.
డబ్బులున్నా – లేకున్నా
సినిమా ఉన్నా – రాకున్నా
తన చుట్టూ భజన చేసే జనం ఉన్నా – పారిపోయినా
– పూరి ఇంతే!
జీవితాన్ని పూరి చూసిన కోణం వేరు. జీవితం పూరిని చూసిన కోణం వేరు. ‘జీవితం అందిరి సరదా తీర్చేస్తది’ అని ఆయనకు తెలుసు. ఈలోగా ఆయన తన సరదాలన్నీ తీర్చేసుకోవాలని చూస్తుంటాడు. అందుకే పూరి సమ్ థింగ్ స్పెషల్ లా కనిపిస్తుంటాడు.
హిట్లున్నప్పుడు ‘వాహ్ పూరి’ అన్నారు. పొంగిపోలేదు. ఫ్లాపులు అట్టర్ ఫ్లాపులు తీసినప్పుడు ‘ఏంటిది పూరి’ అని చీదరించుకున్నారు. కృంగిపోలేదు. పూరికి తెలిసింది ఒక్కటే. సినిమా తీయడం. తీస్తూ తీస్తూ అందులోనే మునిగిపోవడం. రిజల్ట్ ఎవడిక్కావాలి? సినిమానే పూరికి డబ్బిచ్చింది. హోదా ఇచ్చింది. పరపతి ఇచ్చింది. ఆస్తులిచ్చింది. సినిమా కోసం వాటన్నింటినీ తిరిగి ఇవ్వడానికి పూరి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. వరుస ఫ్లాపులొచ్చినప్పుడు తన ముందు ఆస్తులన్నీ కరిగిపోతున్నా – పూరి బెదిరిపోలేదు. ‘ఎక్కడికి పోతాయ్.. తిరిగి చేతికి వస్తాయ్..’ అంటూ ధీమా ప్రదర్శించాడు. అదే జరిగింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా – తిరిగి నిలబడడం, తన చుట్టూ ఉన్నవాళ్లని నిలబెట్టడం పూరికి అలవాటే.
నేనింతేలో ఓ డైలాగ్ ఉంది. హిట్టొచ్చిందని సినిమాలు తీయడం మానేస్తామా, ఫ్లాప్ వస్తే ఆపేస్తామా? ఇది పూరి తనకోసం తాను రాసుకున్న డైలాగ్. తెరమీద రవితేజ పలికాడంతే. ఆ మాటకొస్తే.. పూరి రాసుకున్న ప్రతీ మాటా తన కోసం రాసుకున్నదే. చలంని బాగా చదివేశాడు పూరి. రంగనాయికమ్మ తత్వాన్ని ఔపోశన పట్టాడు. ఇద్దరూ రెబల్సే. వాళ్లని మించి రెబల్ గా మారిపోయాడు.
పూరి సినిమాల్లో హీరోని చూస్తే పూనకాలు వచ్చేస్తాయ్. అయితే అంతకు మించిన కిక్కు, పంచూ పూరి జీవితంలో ఉంది. `ఇలా బతకాల్రా` అనిపించేంత సరదా ఉంది. సుఖం ఉంది. దుఖం ఉంది, త్యాగం ఉంది, ప్రయత్నం ఉంది, ప్రయోగం ఉంది. ఇంకేం కావాలి?
ఆయనంతే. అలాగే ఉంటాడు. అలానే ఉండనిద్దాం. పూరి ఇండ్రస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లయ్యింది. మరో 20 ఏళ్లయినా పూరి ప్రయాణం ఇలానే సాగాలి.