మెహర్ రమేష్ ఇప్పుడు సినిమాలు చేయకపోవొచ్చు. కానీ… మెహర్ రమేష్ మాత్రం ట్రోల్స్ లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. తను ఇచ్చిన కళాఖండాలు అలాంటివి. శక్తి ని తలచుకున్నప్పుడల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇప్పటికీ పీడ కలలు వస్తుంటాయి. షాడో మరో డిజాస్టరు. అందుకే… మెహర్ తో సినిమా చేయడానికి మరో హీరో ధైర్యం చేయలేదు. చాలా కాలంగా మహేష్ తో టచ్‌లో ఉంటూ వస్తున్నాడు మెహర్. తాజాగా చిరు కాంపౌండ్ లో చేరాడు. సీసీసీ విషయంలో చిరుకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు మెహర్. ఇప్పుడు ఏకంగా చిరుతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. మెహర్ తో ఓ సినిమా చేయబోతున్నానని, అది ఇప్పుడు పోగ్రెస్లో ఉందని చిరు చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. చిన్నా చితకా హీరోలే మెహర్ రమేష్‌కి అవకాశం ఇవ్వడానికి భయపడుతుంటే, ఏకంగా మెగాస్టార్ ఎలా పడిపోయాడబ్బా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. సీసీసీ విషయంలో మెహర్ బాగా కష్టపడుతున్నాడు. బహుశా ఆ కర్టెసీ ఉండి ఉంటుంది. కర్టెసీ ఉంటే.. దాన్ని మరోలా చూపించుకోవాలి. సినిమా ఇచ్చేస్తానంటే ఎలా? అందుకే చిరు ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. అయితే మధ్యలో చాలా సినిమాలు ఉన్నాయి లెండి. కొరటాల సినిమా పూర్తవ్వాలి. ఆ తరవాత లూసీఫర్ ఉంటుంది. దర్శకుడు బాబితో ఓ సినిమా చర్చల దశలో ఉంది. ఇవన్నీ అవ్వాలి. ఆ తరవాత.. మెహర్ లైన్లోకి రావాలి. ఈలోపు ఏమైనా జరగొచ్చు.