ప్రభుత్వ భవనాలకు రంగులు తీసేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్లను గతంలో విచారించిన హైకోర్టు పది రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును అమలు చేయని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడా ఎదురుదెబ్బ తగలడతంతో… మళ్లీ రంగులు తొలగించడానికి మూడు నెలల సమయం కావాలని హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఆ సమయం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
అలా అయితే…వైసీపీ రంగులతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో ఏపీ సర్కార్ ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మూడు వారాల గడువు కోరింది. మూడు వారాల్లో రంగులను తొలగిస్తామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో మూడు వారాల్లోపు తొలగించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వైసీపీ కలర్స్ ను తొలగించటం పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించింది.
ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. వచ్చే నెల మూడో తేదీన లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనుకున్న ప్రభుత్వానికి రంగులు తప్పనిసరిగా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. వైసీపీ అధికారలోకి వచ్చినప్పటి నుండి గుడి , బడి తేడా లేకుండా ప్రభుత్వ ఆస్తులన్నింటిపై రంగులు పులిమేశారు. అధికారికంగా జీవోలు కూడా ఇచ్చారు. వీటిని హైకోర్టు కొట్టి వేసింది. ఇలా రంగులు వేయడానికి రూ.పదమూడు వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనికి మళ్లీ రంగులు మార్చడానికి ఆ స్థాయిలో ఖర్చయ్యే అవకాశం ఉంది. ఎంత ఖర్చు అనేదానిపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇంత వరకూ ఇవ్వలేదు.