వైరస్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు చాలా నిజాయితీగా జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇచ్చారు. తక్కువ ధర కిట్లను.. రెండింతల ధరకు కొనుగోలు చేశారని.. పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని.. బీజేపీ , టీడీపీ నేతలతో పాటు సోషల్ మీడియాలోనూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ అధికారులు వివరణ ఇవ్వడంతో తడబడ్డారు. ఒక్కొక్కరు ఒక్కో ధర చెప్పారు. అసలు ఎంతకు కొనుగోలు చేశారో చివరికి.. సండూర్ మెడిసెయిడ్స్ అనే కంపెనీకి ఇచ్చిన ఆర్డర్ పత్రం బయటకు వస్తేనే తెలిసింది. దీనిపై తీవ్రమైన విమర్శలు వస్తూండటంతో.. ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు.
చాలా నిజాయితీగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు జరిగిందని.. తాము ఆర్డర్ ఇచ్చిన సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కేంద్రం ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఐసీఎంఆర్ అనుమతి ఉన్న కంపెనీకే ఆర్డర్ ఇచ్చామని … ఒక్కో కిట్‌ను ఐసీఎంఆర్ రూ.795కి ఆర్డర్ ఇస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.65 తక్కువగా ఆర్డర్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్రానికైనా తక్కువకు అమ్మితే ఏపీకి అదే ధర వర్తింపజేయాలని.. ఆర్డర్ ఇచ్చేటప్పుడు షరతు పెట్టామని… ఇప్పుడు దాని వల్ల ధర తగ్గిపోతోందన్నారు. ఇప్పటివరకు 25శాతం మాత్రమే పేమెంట్ ఇచ్చామని … షరతుల కారణంగా తగ్గిన రేటే వర్తిస్తుందని ఆ మేరకే చెల్లింపులు చేస్తామన్నారు.
ఏపీ సర్కార్ ఆర్డర్ చేసిన కంపెనీ మొదట్లో భారత్‌లో అనుమతులు లేవని.. ఏపీ ప్రభుత్వం ఆర్డర్ చేసిన తర్వాత దేశంలో కిట్ల తయారీ కోసం.. ఆ కంపెనీకి అనుమతి ఇచ్చారని జగన్ విశ్లేషించారు. అందుకే ..దీంతో కిట్ల ధర తగ్గిందన్నారు. ఆర్డర్ పత్రాల్లో… ధర తగ్గింపు క్లాజ్ పెట్టడం వల్ల… తక్కువ ధరకే ఆ కిట్లు వస్తున్నాయని..ప్రజా ధనాన్ని ఆదా చేసినందుకు.. అధికారులను జగన్ అభినందించారు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఎంతకు కొనుగోలు చేసిందో బయటకు రాకపోతే.. మొత్తం సొమ్ము చెలించేవారు.. ఈ విషయంలో వ్యవస్థ ఎక్కడ ఫెయిలయిందో… మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా ఏం చేస్తామో అధికారులు కూడా ముఖ్యమంత్రికి వివరించలేదు.