ర్యాపిడ్ టెస్టుల కిట్ల కొనుగోలు అంశంలో… చత్తీస్గఢ్ చెల్లించిన ధరనే చెల్లిస్తామని.. ప్రభుత్వం ప్రకటించింది. స్కాం జరిగిందంటూ.. సోషల్ మీడియా గోల గోల చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక వేళ బయటకు రాకపోతే.. ఏం జరిగి ఉండేదో అందరూ ఊహించగలిగిందే. అది వేరే విషయం .. కానీ ప్రభుత్వ వర్గాలు అసలు ఓ విషయానికి సూటిగానే కాదు.. పరోక్షంగా కూడా సమాధానం ఇవ్వడం లేదు. అదే… కిట్ల కొనుగోలుకు మధ్యవర్తిగా సండూర్ మెడిసెయిడ్స్ ఎలా వచ్చిందనేది..?
దక్షిణ కొరియా నుంచి నేరుగా కొన్నామని ప్రభుత్వం చెబుతోంది కానీ… వాస్తవానికి సండూర్ మెడిసెయిడ్స్ అనే హైదరాబాద్ కంపెనీ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ఇతర రాష్ట్రాలకు ఎలాంటి కిట్లను అమ్మలేదు. ఒక్క ఏపీ సర్కార్ కు మాత్రమే అమ్మింది. చత్తీస్ గఢ్ ప్రభుత్వం.. ఓపెన్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో దక్షిణా కొరియాకు చెందిన ఎస్డీ బయోసెన్సార్ కంపెనీ నేరుగా పాల్గొంది. 337 రూపాయలకు ఒక్క కిట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన కిట్లు కూడా.. ఈ ఎస్డీ బయోసెన్సార్ కంపెనీవే. కానీ ఆ కంపెనీ అమ్మలేదు. ఏపీ సర్కార్ హైదరాబాద్కు చెందిన సండూర్ మెడిసెయిడ్స్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా వెళ్లిందనేది ఎవరికీ తెలియదు. టెండర్లు వేయలేదు. జీవో ఇవ్వలేదు. అంతా ఓ సస్పెన్స్ వ్యవహారంలా నడిచిపోయింది. అయితే.. చెప్పడానికి వచ్చే సరికి.. దక్షిణ కొరియా నుంచి నేరుగా.. తెప్పించామని… ప్రచారం చేశారు. అంటే తయారీదారు దగ్గరే కొనుగోలు చేశామన్న భావన కల్పించారు.
మంత్రులు, అధికారులు అందరూ… చివరికి ముఖ్యమంత్రితో సహా సండూర్ మెడిసెయిడ్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకు సరఫరా చేస్తే.. ఆ ధరనే చెల్లిస్తామనే ఒప్పందంలో ఉందని.. అందుకే.. ఆ ధర మాత్రమే చెల్లిస్తామని చెబుతున్నారు. ఇక్కడే కొన్ని అనుమానాలను విపక్ష పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సండూర్ మెడిసెయిడ్స్ అనే కంపెనీ ఇతర రాష్ట్రాలకు ఎలాంటి కిట్లను సరఫరా చేయలేదు. ఏపీ కోసం.. కొరియా కంపెనీ నుంచి కొని.. ఏపీకి సప్లయ్ చేసింది. అంటే మధ్యవర్తి పాత్ర పోషించింది. ఇతర రాష్ట్రాలకు ఆ కంపెనీ సరఫరా చేయనప్పుడు.. ప్రభుత్వం చెబుతున్న ఒప్పందంలోని పదో క్లాజ్ వర్తించే అవకాశం లేదు. తాము తక్కువ ధరకు ఎవరికీ సరఫరా చేయలేదని ఆ సండూర్ మెడిసెయిడ్స్ కంపెనీ వాదించడానికి అవకాశం ఉంది.అయితే.. ఈ విషయాన్ని అధికార పార్టీ నేతుల పెద్దగా పట్టించుకోవడం లేదు. తగ్గించిన ధర ఇస్తామనే చెబుతున్నారు. అయితే.. బీజేపీ, టీడీపీ నేతలు మాత్రం.. ఖచ్చితంగా స్కామ్ జరిగిందని..అన్ని వివరాలు బయటకు వస్తాయని అంటున్నారు.