దేశం మొత్తం లాక్ డౌన్లో ఉంది. కేంద్ర రాష్ట్రాలకు పన్నులు రావడం లేదు. అయినప్పటికీ.. రాష్ట్రాల పన్నుల వాటా కింద… కేంద్రం దాదాపుగా రూ. 46వేల కోట్లు విడుదల చేసింది. అందులో.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,892.64 కోట్లు , తెలంగాణకు రూ.982 కోట్లు విడుదల చేసింది. అంటే.. తెలంగాణ కన్నా.. దాదాపుగా రూ. 900 కోట్లు ఎక్కువే ఇచ్చింది. నెల ప్రారంభమయ్యే సరికి ప్రతీ ప్రభుత్వానికి కొన్ని ఖర్చులు ఉంటాయి. సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల జీతాలతో పాటు.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ సర్కార్ కొత్తగా వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల్ని పెట్టి నెలవారీ జీతాలిస్తోంది. అయితే.. గత నెలలో లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోయిందంటూ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు సగం మాత్రమే చెల్లించింది ఏపీ సర్కార్. రెండు విడతలుగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
రెండో విడత ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేదు. చాలా మంది ఉద్యోగులు ఇదే నెలలో చెల్లిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు.. వచ్చే నెల జీతం అయినా పూర్తి స్థాయిలో ఇస్తారా అనుమానాలు ప్రారంభమయ్యాయి. దానికి కారణం ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడమే. అయితే.. కేంద్రం ఈ విషయంలో ఆర్థికంగా రాష్ట్రాలకు అండగా నిలిచింది. పన్నుల వసూళ్లు దాదాపుగా లేకపోయినప్పటికీ.. రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. ఆర్థిక లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఇంకా ఎక్కువ వెసులుబాట్లు కల్పించింది. వేస్ అండ్ మీన్స్ ను.. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వాడుకోవడానికి నిబధనలు సడలించింది. అంటే.. ప్రభుత్వానికి నిధుల కొరత లేనట్లే.
అయితే.. గత నెలలోనే ప్రభుత్వానికి ఆదాయంపై పెద్దగా ఎఫెక్ట్ పడనప్పటికీ.. ఉద్యోగులకు సగం జీతాలను.. పెన్షనర్ల పెన్షన్ ను సగం కోసేశారు. ఈ నెల కూడా అలా చేస్తే.. ఇబ్బంది పడతామని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. మార్చిలో ఉద్యోగులకు జీతాలు తగ్గించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ. 6300 కోట్లు చెల్లించిందనే వార్తలొచ్చాయి. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా రాష్ట్రం ఖండించలేదు. ఎంత చెల్లించారో చెప్పలేదు. అంటే.. చెల్లించినట్లే భావించాలి. ఈ నెల కేంద్రం చేసిన సాయం వల్ల నిధులకు ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తోందని అయినా… మొత్తం జీతాలిస్తామని ప్రభుత్వం చెప్పడం లేదని ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో..?