అధికార పార్టీ కాబట్టి తమకు వైరస్ అంటుకోదని.. భావిస్తున్న నేతల్లో టీఆర్ఎస్ నేతలు కూడా చేరిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా తమను అడ్డుకున్న పోలీసులపై స్టేషన్‌కు వెళ్లి మరీ రుబాబు చేయడానికి వెనుకాడటం లేదు. నాగర్ కర్నూలు టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు వ్యవహారశైలి ఇప్పుడు జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ అవుతోంది. మూడు రోజుల కిందట పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మరీ పోలీసుల్ని బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం.. ఆయన కుమారుడి కారును పోలీసులు అడ్డుకోవడమే. తన కుమారుడి కారునే అడ్డుకుంటారా.. అని… ఆ తర్వాత రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరీ చిందులేశారు ఎంపీ.
లాక్ డౌన్ కారణంగా జిల్లాల సరిహద్దులు కూడా మూసేశారు. అయితే.. ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ మాత్రం.. స్నేహితుల్ని తీసుకుని రాములు అధికారిక వాహనంలో హైదరాబాద్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఎంపీ కారుతో.. పాటు హారన్ మోగించుకుంటూ… చెక్ పోస్టుల వద్ద పోలీసుల్ని బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే.. కారులో ఎంపీ లేకపోవడంతో… పోలీసులు గుర్తించి వాహనాన్ని పహాడిషరీఫ్ స్టేషన్‌కు తరలించారు. అందులో ఉన్న.. పోతుగంటి భరత్‌తో పాటు మరో నలుగుర్ని.. అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే పోలీసులతో భరత్ వాగ్వాదానికి దిగారు. తాను అధికార పార్టీ ఎంపీ కొడుకునని హెచ్చరించారు. కొంత రచ్చ చేసిన తర్వాత పోలీసులకు పై నుంచి ఫోన్లు రావడంతో పంపేశారు.
అయితే.. తన కుమారుడ్నే ఆపుతారా అంటూ.. ఆగ్రహం చెందిన ఎంపీ పోతుగంటి రాములు.. తర్వాత రోజు పోలీసులకు వార్నింగ్ ఇవ్వడానికి నేరుగా పోలీస్ స్టేషన్ కే వచ్చారు. రాములు వ్యవహారంపై కొంత మంది వీడియో తీసి నెట్లో పెట్టారు. కానీ పోలీసులు ఈ విషయం గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు. ఎవరూ .. ఆ సంఘటన గురించి చెప్పడం లేదు. కానీ వీడియో బయటకు రావడంతో నేషనల్ మీడియాలో సైతం హైలెట్ అయింది. కరోనా తీవ్రంగా ఉన్నా… పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. వారికి సెల్యూట్ చేయాలని అందరూ అంటున్న సమయంలో.. టీఆర్ఎస్ నేతలు రుబాబు చేయడానికి ప్రయత్నించడం విమర్శల పాలవుతోంది.