ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మీద విజయసాయిరెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను .. ఆ పార్టీలోని అందరు నేతలు ఖండించారు. బీజేపీలో వైసీపీ సానుభూతిపరులుగా పేరు పొందిన సోము వీర్రాజు లాంటి వారు కూడా… విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కన్నాపై విజయసాయిరెడ్డి చేసిన నిరాధారమైన ఆరోపణల్ని..వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జైలు శిక్ష అనుభవించిన విజయసాయిరెడ్డి.. కన్నాపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని హెచ్చరించారు సోము వీర్రాజు. అదే సమయంలో.. బీజేపీలో రెండు వర్గాలున్నాయనడం సరికాదనే వివరణను కూడా మీడియా ముఖంగా ఇచ్చారు. ఇక్కడే అసలు విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.
కన్నా లక్ష్మినారాయణపై విజయసాయిరెడ్డి … అమ్ముడుపోయారన్న ఆరోపణలు చేసిన తర్వాత … సాయంత్రం వరకూ ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత అదికారిక సోషల్ మీడియా హ్యాండిళ్లలో… విజయసాయిరెడ్డికి ఆయన స్థాయిలోనే జవాబు చెప్పకపోతే అలుసైపోతామని డిసైడయ్యారు. దానికి తగ్గట్లుగా రెస్పాండ్ అయ్యారు. కానీ వైసీపీకి సన్నిహితంగా ఉంటారని పేరున్న నేతలు మాత్రం నోరు విప్పలేదు. అసలు కిట్ల స్కాం గురించి.. బీజేపీ తీవ్రంగా విమర్శలు చేస్తూంటే..ఈ నేతలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. దీంతో హైకమాండ్ రంగంలోకి దిగిందని… తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై అంతటి దారుణమైన ఆరోపణలు చేసిన వారిపై.. కొంత మంది ఎందుకు స్పందించడం లేదనే.. ప్రశ్న… హైకమాండ్ నుంచి వచ్చిదని చెబుతున్నారు దాంతో అందరూ వరుసగా ప్రెస్మీట్లు పెట్టి విజయసాయిరెడ్డిని విమర్శించడం ప్రారంభించారు.
విజయసాయిరెడ్డి ఇప్పటికీ బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. తనను ఎవరు విమర్శిస్తున్నా.. వారిని పట్టించుకోకుండా.. కన్నాను మాత్రమే టార్గెట్ చేశారు. ఆయనను వదిలించుకుంటేనే బీజేపీ బాగుపడుతుందని సలహాలిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే సరి.. లేకపోతే.. వారిపై తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారనే ముద్ర వేయడానికి విజయసాయిరెడ్డి ఏ మాత్రం వెనుకాడటం లేదని.. బీజేపీని చావుదెబ్బకొట్టే వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారని బీజేపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. ఆయనను అలా వదిలి పెడితే.. మొత్తానికే ఏపీ బీజేపీకి అస్థిత్వం లేకుండా చేస్తారన్న ఆందోళన నేతల్లో ప్రారంభమయింది.అందుకే… ఆయన రేంజ్ కు దిగి అయినా సరే ఎదురుదాడి చేయాలన్న ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు.