వైరస్ బాధితుల్ని గుర్తించేందుకు చేస్తున్న రాపిడ్ టెస్టుల్ని రెండు రోజుల పాటు నిలిపివేయాలని ఐసీఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు పంపింది. వైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తప్పుడు ఫలితాల్ని చూపిస్తున్నాయని చెబుతూ..రాజస్థాన్ ప్రభుత్వం వాటి వాడకాన్ని నిలిపివేసింది. ఆ కిట్లతో చేస్తున్న టెస్టుల్లో వస్తున్న ఫలితాలపై అనుమానాలు రావడంతో..రాజస్థాన్ ప్రభుత్వం.. పీసీఆర్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి …ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారాపరిశీలన జరిపింది. కేవలం ఐదు శాతం మాత్రమే ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చినట్లు తేలడంతో… వెంటనే కేంద్ర ప్రభుత్వానికి, ఐసీఎంఆర్ కు సమాచారం ఇచ్చింది.
దీంతో.. ఆ ర్యాపిడ్ టెస్టులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. రెండు రోజుల పాటు పరిశీలన జరిపి తర్వాత.. కిట్ల వినియోగంపై ప్రత్యేక ఎడ్వయిజరీ రూపొంచనున్నారు. ఆ తర్వాత ఏ ఏ కిట్లు ఎలాంటి పద్దతిలో వాడాలో.. ప్రత్యేకంగా వివరించిన తర్వాత వినియోగానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ ర్యాపిడ్ టెస్టుల కిట్ల ద్వారా చేసే ఫలితాలు ప్రామాణికం కాదని.. పీసీఆర్ టెస్టుల ద్వారానే కన్ఫర్మ్ చేయాలని ఐసీఎంఆర్ మొదటి నుంచి చెబుతోంది. రాపిడ్ టెస్టు కిట్లు భిన్న టెక్నాలజీతో రూపొందించారు.
చాలా వాటికి.. కొన్ని ప్రత్యేకమైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరికొన్నింటినీ ఉపయోగించే విధానంలో ఆరోగ్య సిబ్బందికి అవగాహన ఉండటం లేదు. అందుకే.. ఎక్కువగా తప్పుడు ఫలితాలు వస్తున్నాయని ఐసీఎంఆర్ భావిస్తున్నట్లుగా ఉంది. వీటన్నింటినీ కరెట్ చేసేందుకు ప్రత్యేకమైన ఎడ్వయిజరీ విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అందుకే.. రెండు రోజుల పాటు నిలిపివేయమని సూచించినట్లుగా తెలుస్తోంది.